Friday, March 13, 2026
Homeతాజా సమాచారంగ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల...

గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై సమీక్ష

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 13

నూతన ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

10 ప్రధాన అంశాలపై కార్యక్రమాలు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజులపాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం రూపొందించి పది ప్రధాన అంశాలను తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, సమస్యలను గుర్తించి పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.మార్చి 6 నుండి 15 వరకు గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితా చదవాలి

ఎంపీడీవోలు గ్రామాల వారీగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారి జాబితాను సిద్ధం చేసి ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామసభల్లో చదివి వినిపించాలని సూచించారు. గ్రామసభలు, మున్సిపల్ సమావేశాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాలని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోందని, ఎల్-3 నుండి ఎల్-1కు వచ్చిన ఇళ్లలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఉగాది నాటికి సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఎస్‌ఎస్‌సి పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు

ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఎస్‌సి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు కృషి చేసి ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో శాతం శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

డొమెస్టిక్ గ్యాస్‌కు కొరత లేదు

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కమర్షియల్ సిలిండర్లకే కొంత కొరత ఉందని చెప్పారు.దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఇటీవల గ్యాస్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు. డొమెస్టిక్ కనెక్షన్లను అక్రమంగా కమర్షియల్ వినియోగానికి ఉపయోగించిన 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి

సమావేశానికి అధ్యక్షత వహించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.యూరియా కేటాయింపులను మండలాల వారీగా కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వారీగా ఇవ్వాలని, వైటీపీఎస్ సీఎస్ఆర్ నిధులను అభివృద్ధి పనులకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మిర్యాలగూడ అభివృద్ధికి ప్రణాళిక

నియోజకవర్గంలో తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మిర్యాలగూడలో ఈఎన్టీ ఆసుపత్రి ఏర్పాటు, ప్రస్తుత ఆసుపత్రి స్థాయి పెంపు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారం, రింగ్ రోడ్ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఇతరుల ప్రసంగాలు

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ పేదలు, అట్టడుగు వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.మున్సిపల్ చైర్మన్ సుధ, వైస్ చైర్మన్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వ ప్రాధాన్య అంశాలను ప్రజాప్రతినిధులకు వివరించారు.సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments