నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 25
జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల హాజరు, కేంద్రంలో ఉన్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు.జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్‌ను ప్రశ్నిస్తూ హాజరు వివరాలు, ప్రశ్నపత్రాలు–ఆన్సర్ షీట్ల భద్రత, క్లాక్ రూమ్ ఏర్పాట్లు, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వెంట తీసుకువచ్చిన పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, వాచ్‌లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను భద్రపరచేందుకు ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా క్లాక్ రూమ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ప్రశ్నపత్రాలకు కట్టుదిట్టమైన భద్రత
ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్ నుండి కట్టుదిట్టమైన బందోబస్తుతో తీసుకురావాలని, ఆన్సర్ షీట్లను కూడా పోలీస్ భద్రతతో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం ఉండకూడదని, పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించాలని పేర్కొన్నారు.
సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్
పరీక్షల సందర్భంగా ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004251442కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
97 శాతం హాజరు నమోదు
జిల్లాలో మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండవ సంవత్సరం జనరల్, వోకేషనల్ కలుపుకొని మొత్తం 27,018 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మొదటి రోజు పరీక్షకు 97 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెల్లడించారు.
