Monday, March 2, 2026
Homeతాజా సమాచారంచిల్లేపల్లి 2 మేజర్ కాలువలో నిర్వీర్యమైన వ్యవస్థ నీరు లేక వరి పంటలు ఎండిపోతే చూస్తున్న...

చిల్లేపల్లి 2 మేజర్ కాలువలో నిర్వీర్యమైన వ్యవస్థ నీరు లేక వరి పంటలు ఎండిపోతే చూస్తున్న యన్‌ఎస్‌పీ అధికారులు!

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 22

నేరేడు చర్ల మండలం పరిధిలోని చిల్లేపల్లి 2 మేజర్ కాలువ నుంచి వచ్చే ఉపకాలువ ద్వారా శాంతినగర్ మున్సిపాలిటీ చివరి భూములకు సాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. కాలువలో నీటి ప్రవాహం లేకపోవడంతో ఇప్పటికే సాగు చేసిన వరి పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, మధ్యతరగతి రైతుల పొలాల్లో పచ్చదనం మాయమై నేర్రెలు పడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

కాలువల్లో నాచు – నీటి ప్రవాహానికి తాళం వేసిన నిర్లక్ష్యం

చిల్లేపల్లి 2 మేజర్ కాలువలో నాచు విపరీతంగా పెరిగి నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంది. నెలల తరబడి శుభ్రపరిచే పనులు చేపట్టకపోవడం యన్‌ఎస్‌పీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. కాలువలో నీరు లేకపోవడంతో కింది భూములకు ఒక్క చుక్క కూడా చేరని పరిస్థితి నెలకొంది.

ఫిర్యాదులు విన్నట్టు వినని అధికారులు

స్థానిక రైతులు పలుమార్లు యన్‌ఎస్‌పీ అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోయిందని ఆరోపిస్తున్నారు. “కాలువను పరిశీలిస్తామని చెప్పి కాలక్షేపం చేస్తున్నారు కానీ చర్యలు మాత్రం కనిపించడం లేదు” అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్లే పంటలు ఎండిపోతున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు.

మంత్రి నియోజకవర్గంలోనే ఈ దుస్థితి?

ఈ ప్రాంతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలు అత్యంత ప్రాధాన్యంగా ఉండాల్సిన ప్రాంతంలోనే రైతులు సాగునీటి కోసం అల్లాడాల్సి రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. “మంత్రిగారి సొంత నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అప్పుల భారంతో రైతుల ఆవేదన

అప్పులు తీసుకుని వరి సాగు చేసిన చిన్న, మధ్యతరగతి రైతులు ఇప్పుడు పెట్టుబడులు పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పంట నష్టపోతే కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. నీటి లేమి కారణంగా ఇప్పటికే కొంత భాగం పూర్తిగా ఎండిపోగా, మిగిలిన పంట కూడా ప్రమాదంలో ఉందని రైతులు చెబుతున్నారు.

తక్షణ చర్యలు లేకపోతే ఆందోళన

యన్‌ఎస్‌పీ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాలువలో నాచు తొలగించి, చివరి భూముల వరకూ నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని రైతులు హెచ్చరిస్తున్నారు

యన్ ఎస్పీ డి ఈ అమరేందర్ వివరణ

డైనమిక్ పత్రిక రిపోర్టర్ పోన్ లో వివరణ కోరగా ఆ కాలువలో కిలోమీటర్ మేరకు నాచు బాగా ఉండి చివరి భూములకు నీరు అందడం లేదని ఇదే విషయం రైతుల దగ్గరనుండి ఫిర్యాదు వచ్చినది. కాబట్టి మేము వార బందీ వాటర్ నిలుపుదల అవ్వగానే నాచు క్లిన్ చేసి వాటర్ చివరి భూములకు అందేలా చూస్తామని తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments