నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 11
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
పోలింగ్ ప్రారంభమైన వెంటనే కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. అన్ని గదుల నుంచి వెబ్‌కాస్టింగ్ ఉండేలా చూడాలని, పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ టీంలను ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్ల కోసం వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లకు అనుమతి ఇవ్వకూడదని, ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించిన ఓటర్లను లోపలికి అనుమతించాలని సూచించారు.
మోడల్ పోలింగ్ కేంద్రం సందర్శన
బోయవాడలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఓటర్లతో మాట్లాడి సౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు.
ఓటర్లకు విస్తృత సౌకర్యాలు
జిల్లా వ్యాప్తంగా మహిళలు, పురుషుల కోసం వేర్వేరు క్యూలైన్లు, తాగునీరు, టెంట్లు, కుర్చీలు, దివ్యాంగులకు వీల్‌చైర్లు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి వార్డుకు వార్డ్ అధికారులను నియమించి పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 18004251442 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
100% వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ
అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి నల్గొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీల పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి. రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, తహసిల్దార్ పరశురాం తదితరులు పాల్గొన్నారు.



