డైనమిక్ న్యూస్, సూర్యాపేట, జనవరి 31
సూర్యాపేట పట్టణ ప్రజలు శాంతి, అభివృద్ధిని కోరుకునే ప్రజలని, గత పదేళ్లలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరోసారి బీఆర్‌ఎస్‌కు పట్టం కడతారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవల్లిక, గండూరి ప్రకాష్ దంపతులు ధీమా వ్యక్తం చేశారు.
నామినేషన్లు దాఖలు చేసిన దంపతులు
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 34వ వార్డు నుంచి గండూరి ప్రకాష్, 36వ వార్డు నుంచి గండూరి ప్రవల్లికలు తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు.
పదేళ్ల పాలనలో గణనీయమైన అభివృద్ధి
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 2014లో 11వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచి, అనంతరం మున్సిపల్ చైర్పర్సన్‌గా ఐదేళ్లపాటు పనిచేశామని, ఈ కాలంలో సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపించామని గండూరి ప్రవల్లిక తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అనేక అవార్డులు సూర్యాపేట మున్సిపాలిటీకి వచ్చాయని గుర్తు చేశారు.
మరోసారి ప్రజల ముందుకు
2020లో 36వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన తాము, ఇప్పుడు 2026 మున్సిపల్ ఎన్నికల్లో 34, 36 వార్డుల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని వెల్లడించారు.
48 వార్డుల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం
తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా పేరొందిన సూర్యాపేటలోని 48 వార్డుల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ముందు – తరువాత అభివృద్ధి తేడా ప్రజలే గుర్తిస్తారు
2014కు ముందు సూర్యాపేట పరిస్థితి ఎలా ఉందో, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎలా మారిందో ప్రజలు స్వయంగా గమనించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలు చేసిన అభివృద్ధే బీఆర్‌ఎస్‌కు బలమని పేర్కొన్నారు.
వార్డు ప్రజలకు సేవే లక్ష్యం
34, 36 వార్డుల ప్రజలకు కుటుంబ సభ్యుల్లా ఉండి సేవ చేస్తామని, ప్రజలు తమను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గండూరి ప్రవల్లిక – ప్రకాష్ దంపతులు కోరారు.
