Tuesday, April 14, 2026
Homeతాజా సమాచారంసంక్రాంతి తిరుగు ప్రయాణాలపై పోలీసుల అప్రమత్తత 450 మంది సిబ్బందితో ప్రత్యేక ట్రాఫిక్ బందోబస్తు డ్రోన్లతో...

సంక్రాంతి తిరుగు ప్రయాణాలపై పోలీసుల అప్రమత్తత 450 మంది సిబ్బందితో ప్రత్యేక ట్రాఫిక్ బందోబస్తు డ్రోన్లతో గాలిలో నుంచే పర్యవేక్షణ

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 18

సంక్రాంతి పండగ ముగించుకుని ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ దిశగా తిరుగు ప్రయాణాలు భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీస్ శాఖ సమగ్ర చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

జాతీయ రహదారులపై ప్రత్యేక ఏర్పాట్లు

నల్లగొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ముఖ్య కూడళ్ల వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, 450 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేసి నియంత్రణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.

డ్రోన్లతో నిరంతర నిఘా

వాహన రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు డ్రోన్ల ద్వారా గాలిలో నుంచే పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని, రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో తక్షణమే ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

టోల్ ప్లాజాలు, ఫ్లై ఓవర్ల వద్ద ప్రత్యేక సిబ్బంది

ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అధికంగా ప్రయాణించే నేషనల్ హైవేలు, టోల్ ప్లాజాలు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అవసరమైతే వాహనాల గమనాన్ని సజావుగా కొనసాగించేందుకు మార్గమళ్లింపులు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రయాణికుల భద్రతకు వైద్య సదుపాయాలు

ప్రయాణికుల భద్రత దృష్ట్యా అవసరమైన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రమాదకర డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ప్రమాదకర ఓవర్‌టేకింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన నిఘా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

వాహనదారులకు సూచనలు

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణంలో అలసటగా అనిపిస్తే సురక్షిత ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకోవాలని, నిరంతర డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు లేదా అత్యవసర సహాయం అవసరమైనప్పుడు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ లేదా 100 ను సంప్రదించాలని తెలిపారు.

పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి

పండగ అనంతరం తిరుగు ప్రయాణాలు చేసే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, పోలీస్ శాఖకు సహకరించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments