మఠంపల్లి, డైనమిక్ న్యూస్, జనవరి 16
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రపురం తండాలో గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం పాత రాజకీయ కక్షలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇరువర్గాలు పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎన్నికల ఓటమి తర్వాత గ్రామం విడిచిన మాజీ సర్పంచ్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన అనంతరం మాజీ సర్పంచ్ మాలోతు భీముడు నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి హుజూర్‌నగర్‌కు మకాం మార్చి అక్కడే నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల తన స్వగ్రామానికి వచ్చిన ఆయన తెల్లవారుజామున ఒంటరిగా మోటార్ బైక్‌పై పొలాన్ని చూసేందుకు బయలుదేరారు.
దారికాచి దాడి చేశారంటూ భీముడు నాయక్ ఆరోపణ
ఈ క్రమంలో అదే తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ముందుగా దారికాచి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని భీముడు నాయక్ ఆరోపించారు. ఎన్నికల ఓటమి నాటి నుంచే తనపై కక్ష పెంచుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రతివర్గం వాదన.. “మాపై దాడి చేసింది ఆయనే”
అయితే మరో వర్గం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదన్న కారణంతోనే భీముడు నాయక్ తమపై భౌతిక దాడికి దిగారని వారు ప్రతివాదం చేస్తున్నారు. ఈ ఘటనలో తాము బాధితులమని పేర్కొంటున్నారు.
రాజకీయ నేతపై తీవ్ర ఆరోపణలు
ఇదిలా ఉండగా, మండలానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎన్నికల్లో తన ఓటమికి కారణమయ్యాడని భీముడు నాయక్ ఆరోపించారు. అంతేకాక, తనను హత్య చేయించేందుకు తండాకు చెందిన కొంతమంది యువకులతో పథకం పన్నినట్టు కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలీసుల విచారణతో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల వాదనలు నమోదు చేసి, నిజానిజాలు తేల్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
