Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంరోడ్డు భద్రత ప్రమాణాల అమలుతో ప్రమాదాల నివారణకు కృషి– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్...

రోడ్డు భద్రత ప్రమాణాల అమలుతో ప్రమాదాల నివారణకు కృషి– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,20 డిసెంబర్

రోడ్డు భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని శాఖల సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలపై వీడియో కాన్ఫరెన్స్

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026 నిర్వహణపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, రవాణా శాఖ కమిషనర్ వికాస్ రాజ్‌లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రమాదాలు, మరణాల్లో గణనీయమైన తగ్గుదలఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో పోలీస్, రవాణా, రెవెన్యూ, ఆర్ & బి, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.దీని ఫలితంగా గత సంవత్సరం తో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాద మరణాలు 26 శాతం, ప్రమాదాలు 9 శాతం తగ్గినట్లు మంత్రికి వివరించారు. వచ్చే సంవత్సరానికి సమగ్ర కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.

విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రత అవగాహన

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో మాట్లాడిన కలెక్టర్, చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి

బైకు నడిపేటప్పుడు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే అధికారులు, ప్రజలు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. వారం రోజుల గడువు అనంతరం నిబంధనలు పాటించని వాహనాలకు కలెక్టరేట్‌లో ప్రవేశం ఉండదని హెచ్చరించారు.

మండల స్థాయిలో రోడ్డు భద్రత కమిటీలు

మండల స్థాయిలో తహసీల్దార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి బ్లాక్ స్పాట్లను గుర్తించాలని, అవసరమైన చోట సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.బ్లాక్ స్పాట్ల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.

డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు, అవగాహన

లారీ, స్కూల్ బస్ డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు తప్పనిసరిగా ఉంచాలని తెలిపారు. డ్రైవర్లకు హెల్త్ క్యాంపులు నిర్వహించి టిబి సహా అన్ని ఆరోగ్య పరీక్షలు చేయాలని సూచించారు.

పశువుల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు

రాత్రి వేళ రోడ్లపై పశువులు, కుక్కలు సంచరించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

అధికారులు సామాజిక బాధ్యతగా భావించాలి

చిన్న చిన్న భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, ఈ అంశాన్ని అధికారులు సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.

సమావేశానికి హాజరైన అధికారులు

ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా ఎస్పీ కె. నరసింహ, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, ఆర్ & బి ఈఈ సీతారామయ్య, పశుసంవర్ధన అధికారి శ్రీనివాసరావు, ఇండస్ట్రియల్ జీఎం సీతారాం, వెల్ఫేర్ అధికారులు శంకర్, నరసింహారావు, దయానందరాణి, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments