మెదక్, నవంబర్ 15, డైనమిక్ న్యూస్
స్పెషల్ లోక్-అదాలత్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పరిధిలో నమోదు అయిన రాజీ పడదగిన 503 కేసులు శాంతియుత వాతావరణంలో సమర్థవంతంగా పరిష్కరించబడ్డాయి. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న చిన్నపాటి గొడవలు, వివాదాలను ఇరు వర్గాల సమన్వయంతో రాజీ చేసుకునే విధంగా మార్గనిర్దేశం చేసినట్టు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
41 సైబర్ కేసుల్లో రూ. 11.44 లక్షల రికవరీ
లోక్-అదాలత్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్‌కు సంబంధించిన 41 కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ. 11,44,608 మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని సంబంధిత బ్యాంకుల నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ చర్యతో బాధితులకు పెద్ద ఉపశమనం లభించినట్టు పేర్కొన్నారు.
“రాజీ మార్గమే రాజమార్గం” — ఎస్పీ
లోక్-అదాలత్ అనేది క్షణికావేశంలో జరిగే గొడవలు, చిన్నపాటి వివాదాలను కోర్టు చుట్టూ తిరగకుండా తక్షణ పరిష్కారం చేసుకునే అద్భుత వేదిక అని ఎస్పీ అన్నారు.“రాజీ మార్గమే రాజమార్గం ఈ భావన ప్రతి ఒక్కరిలో పెరగాలి” అని ఆయన సందేశం ఇచ్చారు.లోక్-అదాలత్ విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర వహించిన పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, సైబర్ క్రైమ్ యూనిట్ సిబ్బందిని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.
