డైనమిక్,సూర్యాపేటబ్యూరో, నవంబర్ 1
రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీసు అధికారి నరసింహ ఐపీఎస్ ఈరోజు రూరల్ పరిధిలోని పలు రోడ్డు ప్రమాద స్థలాలు, బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించారు. ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను గుర్తించి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జాతీయ రహదారి 65పై పరిశీలన
జాతీయ రహదారి 65పై టేకుమట్ల, రాయిని గూడెం, పిల్లలమర్రి జంక్షన్, జనగామ ఎక్స్‌రోడ్, అంజనాపూరి కాలనీ జంక్షన్, కొత్తమార్కెట్ రోడ్డు జంక్షన్, ఎఫ్‌సిఐ గోదాం వద్ద ప్రమాద స్థలాలను ఎస్పీ పరిశీలించారు.రోడ్డు అథారిటీ అధికారులతో కలిసి ఇంజనీరింగ్ లోపాలను సవరించి, ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులు, లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రమాద నివారణకు సమన్వయ చర్యలు అవసరం
రోడ్డు ప్రమాదాల నివారణ కమిటీలు పటిష్టంగా పనిచేసి, రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఎస్పీ సూచించారు. ప్రజలు ప్రయాణించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.“ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష. అతివేగంగా వాహనాలు నడపవద్దు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయవద్దు.”
ఎస్పీ నరసింహ రైతులకు ప్రత్యేక సూచనలు
రోడ్ల వెంట ఉన్న గ్రామాల రైతులు వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు తప్పుడు మార్గంలో ప్రయాణించ కూడదని ఎస్పీ సూచించారు. రహదారుల దాటే టప్పుడు వెనుక, ముందు చూసుకుని సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారు ప్రయాణికులు సీటు బెల్ట్ వేయడం తప్పనిసరి అని ఎస్పీ గుర్తు చేశారు.అలాగే ప్రమాదం జరిగితే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించి, గోల్డెన్ అవర్‌లో ప్రథమ చికిత్స అందించడం అత్యవసరమని సూచించారు.
ప్రమాద నివారణకు ప్రజలు సూచనలు అనుసరించాల్సిన ముఖ్య జాగ్రత్తలు:
అతివేగంగా వాహనాలు నడపవద్దు, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయవద్దు, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు,హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి,వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దు,పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు,మద్యం సేవించి వాహనాలు నడపవద్దు,ఓవర్టేక్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి,తప్పుడు మార్గంలో వాహనాలు నడపవద్దు,వాహనాల స్థితి, లైటింగ్, సైడ్ మిర్రర్లు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. అనుమతి పత్రాలు, ఇన్సూరెన్స్, లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
పరిశీలనలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రసన్నకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం, పట్టణ ఎస్‌ఐ శివతేజ తదితరులు పాల్గొన్నారు.



