Saturday, April 18, 2026
Homeతాజా సమాచారంశిశు విక్రయాలు, బాల్యవివాహాలపై కఠిన చర్యలు – కలెక్టర్ ఇలా త్రిపాఠి

శిశు విక్రయాలు, బాల్యవివాహాలపై కఠిన చర్యలు – కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

డైనమిక్,నల్లగొండ బ్యూరో, నవంబర్ 1

ఆడబిడ్డలను రక్షించడంలో భాగంగా జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.శనివారం నాడు కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ శాఖాధికారులు, ఆర్సీసీ ఓలతో సమీక్ష నిర్వహించిన ఆమె, ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న శిశు విక్రయాలు, బాల్యవివాహాలు, లైంగిక దాడులు వంటి సంఘటనల నేపథ్యంలో అధికారులపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

శిశు విక్రయం సిగ్గుచేటు”

అభివృద్ధి చెందిన సమాజంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు విషయమని కలెక్టర్ వ్యాఖ్యానించారు. శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరగకుండా ప్రతి శాఖ క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు.ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాలు, బేటీ బచావో–బేటీ పడావో వంటి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అమ్మడం లేదా దత్తత ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గ్రామాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

సీడీపీ ఓలు తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి ప్రజల్లో చైతన్యం కలిగించాలని, అలాగే పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలలో ఈ అంశాలపై చర్చలు జరపాలని ఆమె ఆదేశించారు.దేవరకొండ, పెద్దవూర, నేరేడు గోమ్ము, చందంపేట, అడవిదేవులపల్లి మండలాలలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయని గుర్తుచేసి, సీడీపీ ఓలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

ప్రచార కార్యక్రమాలకు ప్రణాళిక

శిశు విక్రయాలు, బాల్యవివాహాలు నిరోధానికి వాల్ పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, చిన్న వీడియోల ద్వారా అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. వచ్చే వారం సీడీపీ ఓలు, సూపర్వైజర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేశారు.మండల ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లు పర్యవేక్షించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి, గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, సాంఘిక సంక్షేమ డీడీ శశికళ, గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, జిల్లా ఉప వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, విద్యాశాఖ అధికారి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments