సూర్యాపేట బ్యూరో, డైనమిక్,అక్టోబర్ 30
జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఉంటే వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఆయన సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.
కొనుగోలు కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ
మోంధా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ, ముందస్తు అప్రమత్తతతో ధాన్యపు రాశులపై టార్పాలిన్ కప్పడం వల్ల పెద్ద నష్టం జరగలేదని కలెక్టర్ పేర్కొన్నారు.ఎక్కడైనా అడుగు భాగంలో లేదా అంచుల్లో ధాన్యం తడిస్తే వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారిని ఇన్ఛార్జిగా నియమించి, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
ప్రతిరోజూ నివేదిక తప్పనిసరి
ధాన్యం నిల్వ ఉన్న ప్రతి కేంద్రం నుంచి రోజువారీ నివేదిక తప్పనిసరిగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
తడిసిన లేదా కొట్టుకుపోయిన ధాన్యం పై వెంటనే సమాచారం అందించాలని చెప్పారు.కలెక్టరేట్లో 24 గంటల కంట్రోల్ రూమ్ (ఫోన్ నెంబర్: 6281492368) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు, రవాణా లేదా వర్షం కారణంగా ఎదురయ్యే ఏ సమస్య అయినా ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పంట నష్టం అంచనాలు – క్షేత్రస్థాయిలో పరిశీలన
వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు పంట నష్టం అంచనాలను క్షేత్రస్థాయిలో పర్యటించి రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.
వరి పంట కోతకు రాని పొలాలను తడవకుండా ఉండేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
తడిసిన ధాన్యం బ్రాయిలర్ మిల్లులకు
రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు తమ పరిధిలోని బ్రాయిలర్ మిల్లులను సందర్శించి తడిసిన ధాన్యాన్ని అక్కడికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రోడ్లు, చెరువులు, విద్యుత్ – తక్షణ చర్యలు
పంచాయతీరాజ్, ఆర్అండ్బి శాఖ అధికారులు రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్న చోట తక్షణమే పునరుద్ధరణ పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యుత్, త్రాగునీరు సరఫరాలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత
అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు.
పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, వైద్య ఆరోగ్య శాఖ – పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో వచ్చే 21 రోజులపాటు ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.
చెరువుల కట్టల మరమ్మత్తులు – ముందస్తు జాగ్రత్తలు
జిల్లాలో 80 శాతం చెరువులు పూర్తిగా నిండిపోయాయని, మిగిలినవి 75 శాతం వరకు నిండినట్లు కలెక్టర్ తెలిపారు.
బలహీనంగా ఉన్న చెరువు కట్టలను వెంటనే బలపరచాలని, చెరువుల కింద నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
మూసి, బికేరు వాగు, పాలేరు వాగు నిండుగా ప్రవహిస్తున్నందున పరివాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలను ఆదేశించారు.
ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు – ఎస్పీ నర్సింహ
జిల్లా ఎస్పీ కే. నర్సింహ మాట్లాడుతూ, మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరూ ప్రమాదంలో పడకుండా అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాలు, కాలువలు, బ్రిడ్జిల వద్ద నీరు పైకి చేరితే రాకపోకలు నిలిపి, మరమ్మతులు పూర్తి చేసిన తర్వాతే రవాణా అనుమతించాలని సూచించారు.
ప్రతి కేంద్రానికి ఇన్ఛార్జ్ అధికారులు
అదనపు కలెక్టర్ కె. సీతారామరావు మాట్లాడుతూ, పంచాయతీ సెక్రటరీలు, గ్రామపాలనాధికారులు మరియు సీసీలలో ఒక్కరిని ప్రతి కొనుగోలు కేంద్రానికి ఇన్ఛార్జ్గా నియమించాలని సూచించారు.
వారు ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో వి.వి. అప్పారావు, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డిపిఓ యాదగిరి, ఆర్అండ్బి ఈఈ సీతారామయ్య, పంచాయతీరాజ్ ఈఈలు వెంకటయ్య, మాధవి, ఇరిగేషన్ ఎస్సీ శివధర్మ, డీఎస్ఓ మోహన్ బాబు, డీఎం రాము, డీసీఓ పద్మ, రవాణా అధికారి జయప్రకాశ్ రెడ్డి, అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, సిపిఓ కిషన్, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


