Saturday, February 7, 2026
Homeఆంధ్ర ప్రదేశ్సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో వేటపాలెం ఉపాధ్యాయురాలి సత్తా స్పెషల్ ఇన్నోవేటివ్ అవార్డు సాధించిన బత్తుల...

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో వేటపాలెం ఉపాధ్యాయురాలి సత్తా స్పెషల్ ఇన్నోవేటివ్ అవార్డు సాధించిన బత్తుల నీలిమ పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం

బాపట్ల, డైనమిక్ న్యూస్, జనవరి 28

విద్యార్థుల్లో విజ్ఞానపిపాసను పెంపొందిస్తూ, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తున్న వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు బత్తుల నీలిమ సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పోటీలలో స్పెషల్ ఇన్నోవేటివ్ అవార్డు సాధించడం గ్రామానికి గర్వకారణమని పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు అన్నారు.ఈ సందర్భంగా బుధవారం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో నీలిమను ఘనంగా సత్కరించారు. రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్సెస్ విభాగంలో వినూత్న ఆవిష్కరణతో అవార్డు సాధించి, హైదరాబాద్ వేదికగా తెలంగాణ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ద్వారా ఆమె గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు.

మండల నుంచి జాతీయస్థాయి వరకు విజయం

‘ప్రకృతి వనరులతో సుస్థిర భవిష్యత్తు’ అనే అంశంతో నీలిమ రూపొందించిన ప్రాజెక్టు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రథమ స్థానాలు సాధించి, సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఎంపికైంది. ఈ నెల 19 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది ప్రాజెక్టుల మధ్య ఆమె ప్రాజెక్ట్ ప్రత్యేక గుర్తింపు పొందింది.

నడకతో విద్యుత్తు ఉత్పత్తి – వినూత్న కాన్సెప్ట్

‘నడకతో విద్యుత్తు తయారు చేయడం’ అనే నూతన ఆలోచనతో రూపొందించిన ప్రాజెక్ట్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంపై అవగాహన పెంపొందించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే విధంగా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేయడం విశేషమని నిపుణులు ప్రశంసించారు.

పేద విద్యార్థులకు సాంకేతికత చేరువ చేసే ప్రయత్నం

వెనుకబడిన ప్రాంతమైన వేటపాలెం గ్రామంలోని పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తూ, వారి చేత అనేక వినూత్న ప్రాజెక్టులు తయారు చేయిస్తూ, శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచడంలో బత్తుల నీలిమ కీలక పాత్ర పోషిస్తున్నారని సంఘం నాయకులు కొనియాడారు.

పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బట్ట మోహన్రావు, సహాయ కార్యదర్శి నాగాంజనేయులు, శరత్ బాబు, శేఖర్ బాబు, ప్రత్తి అనంత లక్ష్మీ, సత్యవాణి, ఉపాధ్యాయులు ఉమ్మిటి వేణుగోపాల్, సరళ, గురు మణి, జె. దేవబిక్షం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments