గరిడేపల్లి, ఏప్రిల్ 11, శుభోదయ డైనమిక్ వార్త
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడ్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ ధరణి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని పొనుగోడు గ్రామ అంగన్వాడి కేంద్రం-06లో సేవా పక్వాడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పోషకాహారం పై అవగాహన
ఈ సందర్భంగా ధరణి మాట్లాడుతూ కుటుంబంలో నిత్యం వాడే ఆహార పదార్థాల ద్వారా సరైన పోషణ పొందవచ్చని తెలిపారు. ఆకుకూరలను స్వయంగా పండించుకునే విధానాలపై వివరించారు. రేషన్ ద్వారా అందించే ఫోర్టిఫైడ్ రైస్‌లో ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా ఉండి గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మేలుచేస్తుందని చెప్పారు.
వివిధ ఆహారాల్లో పోషకాలు
కందిపప్పులో మాంసకృత్తులు అధికంగా ఉంటాయని, రాగులు, నువ్వులు, వట్టి చేపలు, ఆకుకూరల్లో మినరల్స్ లభిస్తాయని వివరించారు. అలాగే నిమ్మ, బత్తాయి, మామిడి, టమాటా, క్యాప్సికం వంటి వాటిలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వంటి వాటిలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయని చెప్పారు.
వడదెబ్బ నివారణపై సూచనలు
అనంతరం ఏఎన్ఎం కందిమల్ల సునీత మాట్లాడుతూ వడదెబ్బకు గురైనవారికి వెంటనే ఓఆర్ఎస్ అందించాలని సూచించారు. బియ్యం, చక్కెర, జొన్నలు, ఆలుగడ్డలు వంటి తెల్లటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో వీటి వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పోకల నాగమణి, ఆయా మెడిసినమెట్ల ధనమ్మ, ఆశా కార్యకర్త నందిపాటి నీలవేణి, మహిళలు, పిల్లలు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
