డైనమిక్ ,సూర్యాపేట బ్యూరో
నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక ఉన్న పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సారధ్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ నెల 25వ తేదీన జరగనున్న జాబ్ మేళా కోసం సూర్యాపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత అందరూ హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ వెళ్లకుండా జిల్లాలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సాకారం ఆధ్వర్యంలో 150 ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయని, 2 వేల నుండి 5 వేల వరకు ఉద్యోగ అవకాశాలు లభ్యమవనున్నాయని వివరించారు.జిల్లా కేంద్రంలోని కళాశాలల యాజమాన్యాలతో చర్చించి, ఎక్కువ మంది విద్యార్థులను జాబ్ మేళాకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ జాబ్ మేళాలో పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు పాల్గొనవచ్చని చెప్పారు.సూర్యాపేట యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని వేణారెడ్డి పేర్కొన్నారు.
