డైనమిక్,కోదాడ, అక్టోబర్ 26
కోదాడ పట్టణంలో సెప్టిక్ ట్యాంక్‌ల పేరుతో కొత్త రకం దందా వెలుగుచూస్తోంది. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది సెప్టిక్ ట్యాంక్ యజమానులు లాభాల కోసం సిండికేట్‌గా ఏర్పడి బ్లాక్‌మెయిలింగ్ వ్యాపారానికి తెరలేపారు.
వాల్ రైటింగ్‌లతో ప్రచారం
“మీ సెప్టిక్ ట్యాంక్ నిండిందా..? వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి” అంటూ గోడలపై వాల్ రైటింగ్‌లు రాసి ప్రచారం చేస్తున్నారు. ఫోన్ చేసిన వెంటనే ఒక వ్యక్తి లీడ్ తీసుకొని అన్ని కాల్స్‌ను తన ఆధీనంలో ఉంచుకుంటాడు.
ఇష్టం వచ్చిన రేట్లు, దురుసైన ప్రవర్తన
మొదట వచ్చి ట్యాంక్‌ను చూసి రూ.5,000 రేటు చెబుతారు. గతంలో రూ.1,500 మాత్రమే ఉండేది కదా అని ఇంటి యజమాని అడిగితే, “ఇప్పుడు ఎవ్వరూ ఈ పని చేయడం లేదు, మీకు ఇష్టం ఉంటే చేయిస్తాం, లేకపోతే మీరే కంపు కొట్టండి” అంటూ దురుసుగా సమాధానం ఇస్తారు.
సిండికేట్‌గా పనిచేస్తున్న యజమానులు
ఇంకో యజమానిని సంప్రదిస్తే అతడు రూ.6,000 చెబుతాడు. “మీ దగ్గరకు ఎవరైనా వచ్చారా? అయితే వారితోనే చేయించుకోండి” అంటూ తిరస్కరిస్తాడు. ఈలోపు ఆ ఇంటి యజమాని పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ వంటి వివరాలు వారి సిండికేట్ గ్రూపుల్లో హల్చల్ అవుతాయి.దీంతో ఇతరులు ఆ ఇంటికి వెళ్లకుండా, ఒకరినొకరు కాపాడుకుంటూ, రేట్లు పెంచి ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు.
ప్రజల ఆవేదన
సెప్టిక్ ట్యాంక్‌ల పేరుతో జరుగుతున్న ఈ బ్లాక్ మెయిలింగ్‌పై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి దందాలను అరికట్టాలని, న్యాయమైన రేట్లు నిర్ణయించాలని, ప్రజల ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాలని” కోదాడ నియోజకవర్గ ప్రజలు అధికారులు కోరుతున్నారు.
అధికారుల దృష్టి అవసరం
సాధారణ ప్రజలపై బరువైన రేట్లు మోపి మోసం చేస్తున్న సెప్టిక్ ట్యాంక్ యజమానులపై మున్సిపల్ అధికారులు, పోలీసు విభాగం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.
