డైనమిక్,నల్లగొండ బ్యూరో , అక్టోబర్ 21
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకొని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు స్తూపం వద్ద పుష్పగుచ్చాలు అర్పించి నివాళులు అర్పించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ
పోలీస్ శాఖ దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజారక్షణకు త్యాగాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన పరిష్కారాలను అందిస్తున్నదని తెలిపారు. ప్రాణ త్యాగాలతో పాటు ఎటువంటి సెలవులు లేకుండా ప్రజల రక్షణలో పోలీస్ సిబ్బంది నిత్యపోరాటంలో ఉన్నారని అన్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ
దేశ వ్యాప్తంగా విది నిర్వహణలో 191 మంది పోలీసులు అమరులయ్యారని, అందులో తెలంగాణలో ఐదుగురు ఉన్నారని తెలిపారు.శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటామని, జిల్లా పోలీసులు అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.పోలీస్ ఫ్లాగ్ డే (అక్టోబర్ 21) సందర్భంగా ఈ నెల 31వ తేది వరకు జిల్లా అంతటా వివిధ కార్యక్రమాలు నిర్వహించ బడనున్నాయి. ఇందులో పోలీస్ ఓపెన్ హౌస్, మెగా రక్తదాన శిబిరాలు, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, సైకిల్ ర్యాలీ ప్రధానంగా ఉంటాయి తెలిపారు.కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, పోలీసులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



