నేరేడుచర్ల డైనమిక్, నవంబర్9
సరదాగా మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసి నిమజ్జనం చేయడానికి వెళ్లిన బాలిక దురదృష్టవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాద ఘటన శనివారం నేరేడుచర్ల మండలం సోమవారం గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు సోమవారం గ్రామానికి చెందిన కొమ్మరాజు సుస్మిత (13) అనే బాలిక, సోమవారం హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థిని. శనివారం సెలవు కావడంతో ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసింది. దానిని నిమజ్జనం చేయడానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సోమప్ప దేవాలయం వెనుక భాగంలో ఉన్న మూసీ నది వద్దకు వెళ్లింది.అయితే నిమజ్జనం సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి గల్లంతయింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, రెస్క్యూ టీమ్‌లు మరియు గ్రామస్థులు కలసి శనివారం మధ్యాహ్నం నుంచే గాలింపు చర్యలు చేపట్టారు.
మూసీ ప్రవాహంలో కొట్టుకుపోయిన మృతదేహం గుర్తింపు
ఆచూకీ కోసం రాత్రంతా కొనసాగిన గాలింపులో ఫలితం రాలేదు. ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో బూర్గులతండా సమీపంలో మూసీ నది అవతల వైపు నీటి ప్రవాహంలో సుస్మిత మృతదేహం కనిపించింది. గ్రామస్థులు సమాచారమిచ్చి వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఎస్సై రవీందర్ నాయక్ ధైర్యవంతమైన చర్య
వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో మృతదేహాన్ని తీరానికి తీసుకురావడం చాలా కష్టంగా మారింది. అయితే నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ స్వయంగా తెప్పపై ఈత కొడుతూ తాడు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఈ సాహసోపేత చర్యను చూసి గ్రామస్థులు “హ్యాట్సాఫ్ రవీందర్ నాయక్ ఎస్సై ” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.ఒక చిన్నారి ప్రాణం కోల్పోయిన విషాదం నేరేడుచర్ల ప్రజలను కుదిపేసింది. అదే సమయంలో ధైర్యవంతమైన పోలీసు అధికారి ఎస్సై రవీందర్ నాయక్ చేసిన సేవ అందరికీ ఆదర్శంగా నిలిచింది.
మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం తరలింపు
పోలీసులు మృతదేహాన్ని హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
