విశాఖపట్నం, డైనమిక్, అక్టోబర్ 22:
ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరికొన్నింటికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి, బుధవారం ఉదయానికి దక్షిణ కోస్తా ఆంధ్ర – ఉత్తర తమిళనాడు తీరాల సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తదుపరి 24 గంటల్లో ఇది తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ మోడళ్లు సూచిస్తున్నాయి. మరోవైపు, దక్షిణ బంగాళాఖాతంలో శుక్ర, శనివారాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి.అరేబియా సముద్రంలో ఇప్పటికే ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో భారీ వర్షాలు
అమరావతి వాతావరణ కేంద్రం మరియు విపత్తుల నిర్వహణ సంస్థలు వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని ప్రకటించాయి.
బుధ, గురువారాలు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.
బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని అంచనా.
శుక్ర, శని, ఆదివారాల్లో కొన్ని ప్రాంతాల్లో మరిన్ని భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండటంతో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – విపత్తుల నిర్వహణ సంస్థ
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రభావిత జిల్లాల యంత్రాంగాలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 1800-425-000 లకు సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
