డైనమిక్ న్యూస్, మెదక్ జిల్లా ,అక్టోబర్ 30
చీలపల్లి బ్రిడ్జి వద్ద తనిఖీల్లో బలెనో కారు పట్టింపు పెద్ద శంకరంపేట పోలీసులు డీజిల్ దొంగల బృందాన్ని అరెస్ట్ చేసినట్లు గురువారం సీఐ రేణుకా రెడ్డీ, ఎస్ ఐ ప్రవీణ్ రెడ్డి లు ఎర్పాటు చేసినవిలేకర్ల సమావేశంలో తెలిపారు .బుదవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఎస్సై సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చీలపల్లి బ్రిడ్జి వద్ద TS08FF 3047 నంబర్ గల బలెనో కారును ఆపి తనిఖీ చేశారు.కారులో 30 లీటర్ల సామర్థ్యం గల ఆరు ఖాళీ డబ్బాలు లభించాయి. పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ముగ్గురు యువకులను కారుతో సహా స్టేషన్‌కు తరలించి విచారించారు.
నిందితుల వివరాలు
పోలీసులు విచారణ జరిపినప్పుడు నిందితులు సబవత్ రాహుల్ (వనపర్తి జిల్లా), కురుమ గణేష్ (కామారెడ్డి జిల్లా లింగంపేట్), తోకల నాగరాజు (మహబూబ్‌నగర్ జిల్లా అడ్డకల్ మండలం) అని వెల్లడించారు.వీరు హైదరాబాదులోని కూకట్పల్లి ప్రాంతంలో నివసిస్తూ ఆటో డ్రైవింగ్, కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
డబ్బు కోసం డీజిల్ దొంగతనాలు
తమకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డీజిల్ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడించారు.
బోరబండకు చెందిన అన్వర్ అనే వ్యక్తి పరిచయంతో రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీలలో నుంచి డీజిల్ దొంగిలించి అతనికి విక్రయించేవారని పోలీసులు తెలిపారు.
నిజాంపేట, జోగిపేటల్లో కూడా దొంగతనాలు
నిందితులు అక్టోబర్ 22న TS08FF 3047 నంబర్ గల బలెనో కారును అద్దెకు తీసుకుని నిజాంపేట, ఔటర్ రింగ్ రోడ్, జోగిపేట ప్రాంతాల్లో లారీలలోని డీజిల్‌ను దొంగిలించి బోరబండలోని అన్వర్‌కి విక్రయించారు. తర్వాత అక్టోబర్ 25న శంకరంపేటకు వచ్చి చర్చి కాంపౌండ్‌లో ఉన్న జుగాల్పూర్ నారా గౌడ్ టిప్పర్ల నుంచి 150 లీటర్ల డీజిల్‌తో పాటు గోదాం తాళం పగులగొట్టి ఒక పాత బ్యాటరీ, లారీ జాక్ దొంగిలించి వాటిని కూడా విక్రయించినట్లు విచారణలో తెలిపారు.
ముగ్గురు రిమాండ్‌కు – అన్వర్ కోసం గాలింపు
శంకరంపేట పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ప్రధాన నిందితుడు అన్వర్ పరారీలో ఉండగా, పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
