సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్ డిసెంబర్ 16
ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నికలపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఎన్నికల సిబ్బంది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.
డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల పరిశీలన
డిసెంబర్ 17న నిర్వహించనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి, హుజూర్నగర్ మండలాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
ఎన్నికల గణాంకాలు
హుజూర్నగర్ డివిజన్ పరిధిలోని హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాలలో
146 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలు
1318 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో 22 సర్పంచ్ స్థానాలు, 257 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా,
డిసెంబర్ 17న 124 గ్రామపంచాయతీలు, 1061 వార్డు సభ్యుల స్థానాలకు
1176 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ సామాగ్రిపై ప్రత్యేక జాగ్రత్త
పోలింగ్ కేంద్రాలకు బయలుదేరే ముందు అవసరమైన పోలింగ్ సామాగ్రి అంతా తీసుకున్నారో లేదో మరోసారి పరిశీలించుకోవాలని సూచించారు. కొన్నిచోట్ల సర్పంచ్ ఏకగ్రీవమైనప్పటికీ వార్డులకు, మరికొన్నిచోట్ల వార్డు సభ్యులు ఏకగ్రీవమైనప్పటికీ సర్పంచ్‌కు ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటూ బ్యాలెట్ పేపర్ల పంపిణీలో ఆర్వోలు, సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.
పోలింగ్ సమయ నిబంధనలు
పోలింగ్ ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.
ఏదైనా పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ ముందుగానే పూర్తయినప్పటికీ మధ్యాహ్నం 1:00 గంటల వరకు బ్యాలెట్ బాక్స్‌లను సీల్ చేయరాదని, ఫారంలు నింపరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
టోకెన్లు, ఓటింగ్ ముగింపు విధానం
మధ్యాహ్నం 1:00 గంటల తరువాత కూడా పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉన్నట్లయితే వారికి వరుస క్రమంలో టోకెన్లు జారీ చేసి అందరూ ఓటు వేసిన అనంతరం మాత్రమే పోలింగ్ ముగించాలని సూచించారు.
లెక్కింపు ప్రక్రియపై ఆదేశాలు
మధ్యాహ్నం 2:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. లెక్కింపు పూర్తయ్యే వరకు, అలాగే ఉపసర్పంచ్ ఎన్నిక ముగిసే వరకు వీడియో గ్రఫీ తప్పనిసరి అని ఆదేశించారు.
సందేహాస్పద ఓట్లపై నిర్ణయం తీసుకున్న అనంతరమే లెక్కింపు ప్రారంభించాలని సూచించారు.
ఉపసర్పంచ్ ఎన్నికల విధానం
సర్పంచ్ ఎన్నిక ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నికకు మొదటి నోటీసు ఇవ్వాలని, అవసరమైతే రెండో నోటీసుతో డిసెంబర్ 18న ఎన్నిక నిర్వహించాలని తెలిపారు. రెండోసారి కూడా కోరం లేకపోతే అదే రోజు మధ్యాహ్నం మూడో నోటీసుతో కోరం లేకుండానే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించవచ్చని వివరించారు.
రీకౌంటింగ్ నిబంధనలు
ఎక్కువ ఓట్లు ఉన్న చోట్ల ఆర్వోలకు సహాయంగా ఏఆర్వోలను నియమించి రెండు లేదా మూడు టేబుల్స్ ద్వారా లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు. రీకౌంటింగ్ జిల్లా ఎన్నికల విభాగం అనుమతితో మాత్రమే చేయాలని, రీకౌంటింగ్ సమయంలో రివేరిఫికేషన్ చేయకుండా కేవలం ఓట్లు మాత్రమే లెక్కించాలని స్పష్టం చేశారు.
శాంతిభద్రతలపై హెచ్చరిక
పోలింగ్ లేదా శాంతిభద్రతల విషయంలో ఏవైనా గందరగోళ పరిస్థితులు తలెత్తినా వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఎన్నికల సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని తెలిపారు.
విజయోత్సవాలపై నిషేధం
ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాలు కాల్చడం వంటి కార్యక్రమాలు చేపట్టవద్దని అభ్యర్థులు, ప్రజలను కలెక్టర్ కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అధికారులు హాజరు
ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు సరోజ, సోమ సుందర్ రెడ్డి, లక్ష్మి, జగదీశ్, సుమంత్, తహసిల్దారులు స్రవంతి, సురీగీ సైదులు, కమలాకర్, మంగా, కవితతో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
