డైనమిక్ న్యూస్, హుజూర్నగర్, మార్చి 16
హుజూర్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మస్తాన్ జానీ అనే ఉద్యోగి ప్రజల అవసరాలను అవకాశంగా మార్చుకొని బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.
పని కావాలంటే ముందుగా డబ్బు..!
కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాడని సమాచారం. ముఖ్యంగా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వచ్చే వారిని 2000 నుండి 3000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు త్వరగా పూర్తి అవుతాయని, లేకపోతే రోజులు గడుస్తున్నాయని పలువురు వాపోతున్నారు.
ప్రతి పనికి ప్రత్యేక రేటు
ఈసీ, సీసీ కాపీలు వంటి పనులకు కూడా ప్రత్యేక రేట్లు పెట్టి వసూలు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పని తీరును బట్టి వసూళ్లు జరుగుతున్నాయని, కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్ లేదా మోర్ట్గేజ్ ప్రక్రియలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సమయపాలన లేకుండా విధులు
అంతేకాకుండా ఆ ఉద్యోగి కార్యాలయ సమయాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వస్తూ పోతూ ఉంటాడని, పని సమయంలోనే రోడ్లపై తిరుగుతూ కనిపిస్తాడని స్థానికులు చెబుతున్నారు.
ఆఫీసులోనే అత్తర్ వ్యాపారం?
ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తూనే అత్తర్ (సువాసన ద్రవాలు) వ్యాపారం కూడా చేస్తున్నాడని సమాచారం. కార్యాలయంలోనే ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు పలువురు చెబుతున్నారు.
అధికారులు స్పందించాలనే డిమాండ్
ఈ ఘటనలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఇలాంటి చర్యలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

