అమరావతి, డైనమిక్ న్యూస్, నవంబర్ 26
రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో బుధవారం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవితమ్మను శ్రీకాకుళం జిల్లా చేనేత సొసైటీల ప్రతినిధులు, పలువురు నేతన్నలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి శ్రీకాకుళం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వం వహించారు.
చేనేతల సమస్యలపై వినతి
ఈ సందర్భంగా జిల్లాలోని చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సవిత దృష్టికి మంత్రి అచ్చెన్నాయుడు తీసుకువచ్చారు. ముడిసరుకు కొరత, మార్కెటింగ్ ఇబ్బందులు, కార్మిక సంక్షేమ పథకాల అమల్లోని లోపాలు వంటి అంశాలను వివరంగా వెల్లడించారు.
ప్రభుత్వ సహకారంపై భరోసా
నేతన్నల ఇబ్బందులను ఓపికగా విన్న మంత్రి సవిత సీఎం చంద్రబాబు నాయుడు చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. నేతన్నల సంక్షేమం, పరిశ్రమ పునరుజ్జీవనమే ప్రభుత్వ లక్ష్యమని, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
త్వరిత చర్యలకు హామీ
శ్రీకాకుళం జిల్లాలోని చేనేత సొసైటీల బలోపేతం, మార్కెటింగ్ సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల సకాలంలో అమలు దిశగా చర్యలు చేపడతామని మంత్రి సవిత పేర్కొన్నారు. నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
