డైనమిక్,మాడుగులపల్లి, నవంబర్ 5
మండలంలోని ఇసుకబావిగూడెం నుండి వేములపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై ఏర్పడ్డ గుంతలను రైతులు స్వచ్ఛందంగా పూడ్చి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఎన్ఎస్పీ కాల్వ బ్రిడ్జి నుండి ఎల్-14 లిఫ్ట్ వరకు కాల్వ కట్టపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు, రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీనితో చలించిపోయిన ఇసుకబావిగూడెం గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు తంగేళ్ల సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ రైతులు ఏకతాటిపైకి వచ్చారు. తమ స్వంత ఖర్చులతో ట్రాక్టర్ల సహాయంతో మట్టి పోసి, డోజర్‌తో రహదారిని చదును చేశారు.ఈ కార్యక్రమంలో వేములపల్లి మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, లిఫ్ట్ చైర్మన్ అమిరెడ్డి శేఖర్ రెడ్డి, స్థానిక రైతులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి రైతులు చూపిన ఈ చొరవ ఆదర్శంగా నిలుస్తోంది.
