డైనమిక్ న్యూస్ | మార్చి 9 | టేక్మాల్ ప్రతినిధి
మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో దుర్గమ్మ, పోచమ్మ అమ్మవార్ల జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో తొలి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.
భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ
జాతర తొలి రోజున గ్రామ ముత్తైదువలు అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. ఉదయం నుంచే ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు కొత్త కుండల్లో బోనాలను వండి, వాటిని పూలతో అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య భక్తులు భక్తి పరవశంలో పాల్గొన్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు.
జాతరకు సర్వాంగ సుందరంగా ఆలయ అలంకరణ
జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రాత్రివేళల్లో విద్యుత్ కాంతులతో ఆలయం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు క్యూ లైన్లు, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
రేపు ప్రధాన ఆకర్షణ బండ్ల ఊరేగింపు
జాతరలో భాగంగా సోమవారం బండ్ల ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిర్వహించనున్నారు. రైతులు తమ ఎడ్ల బండ్లను రంగులు, పూలతో అలంకరించి ఆలయం చుట్టూ ఊరేగింపుగా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
