Monday, April 13, 2026
Homeతాజా సమాచారంశిథిలావస్థలో పశువైద్యశాల నిర్లక్ష్యానికి పరాకాష్టగా జిల్లా అధికారులు!

శిథిలావస్థలో పశువైద్యశాల నిర్లక్ష్యానికి పరాకాష్టగా జిల్లా అధికారులు!

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, ఏప్రిల్ 13

నేరేడుచర్ల మండల పరిధిలోని పెంచికల్ దిన్న గ్రామంలోని పశువైద్య హాస్పటల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పైకప్పు స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నా, ఎలాంటి మరమ్మత్తులు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం

స్థానిక సిబ్బంది పలుమార్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సమస్య తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైన అధికారులు, కేవలం ఫైళ్లకే పరిమితమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్న అధికారుల వైఖరి

ప్రతి రోజు భవనంలో స్లాబ్ ముక్కలు ఊడిపడుతుండగా, ఎప్పుడైనా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం స్పందించకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాతే కదిలే విధానాన్ని అనుసరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పర్యవేక్షణలో విఫలం

జిల్లా స్థాయి తనిఖీలు, పర్యవేక్షణ పూర్తిగా లేవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను తెలుసుకునే బాధ్యత ఉన్న అధికారులు తమ విధులను విస్మరించారని ప్రజలు మండిపడుతున్నారు.

ఆలస్యం వల్లే ప్రమాదం?

సమస్య చాలా కాలంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ కొత్త భవనం నిర్మాణం గానీ, తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గానీ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోంది.

అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు

ప్రాణాలు పోయిన తర్వాతే చర్యలు తీసుకుంటారా? లేక ఇప్పటికైనా స్పందించి బాధ్యత తీసుకుంటారా జిల్లా అధికారులు?

డాక్టర్ నరేష్ వివరణ

ఈ రోజే పెచ్చులు ఊడి పడింది. భవనం చాలా శిథిల వ్యవస్థకు చేరింది. ఈ భవనంలో19గ్రామాల రైతుల పశువులకు వైద్యం అందించాలని అలాగే డ్యూటీ చేయాలన్న కూడా భయంగా ఉందని పై అధికారులకు రిపోర్ట్ చేశామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments