Monday, March 2, 2026
Homeతాజా సమాచారంలక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్

లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 2

ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అన్ని శాఖలు నిర్దేశించిన లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులకు సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కూడా సమయానుసారంగా పరిష్కరించాలని చెప్పారు.హాస్టళ్ల తనిఖీలపై నిర్దేశిత ప్రొఫార్మాలో మండలాల ప్రత్యేక అధికారులు నివేదికలు సమర్పించాలని సూచించారు.

బడ్జెట్ వృథా కాకుండా పనులు పూర్తి చేయాలి

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున వివిధ పద్దుల కింద మంజూరైన నిధులతో చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. బడ్జెట్ వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఉపాధి హామీ, స్కాలర్షిప్‌లు, పంచాయతీరాజ్, ఆర్ & బి, ఇతర ఇంజనీరింగ్ శాఖల పనులను ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయాలన్నారు.

వేసవి కార్యచరణ ప్రణాళికపై సమావేశాలు

వేసవి కార్యచరణ ప్రణాళికకు సంబంధించి మండల స్థాయిలో వెంటనే సమావేశాలు నిర్వహించాలని ప్రత్యేక అధికారులకు ఆదేశించారు.

పదవ తరగతి పరీక్షలు, రబీ ధాన్యం కొనుగోలు

రానున్న పదవ తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మార్చి 15 నుండి 20 మధ్య రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలాల ప్రత్యేక అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

రంజాన్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

రంజాన్ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం అందించే తోఫా పంపిణీ, మహిళా యోజన, కుట్టుమిషన్ల పంపిణీ తదితర కార్యక్రమాలను మండలాల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

123 ఫిర్యాదులు స్వీకరణ

ఈ సోమవారం మొత్తం 123 ఫిర్యాదులు వచ్చాయి. అందులో రెవిన్యూ శాఖకు 59, ఇతర జిల్లా అధికారులకు 64 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments