గుంటూరు, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను ప్రజలకు చేరువయ్యేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూటమి నాయకులు, కార్యకర్తలదేనని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అహమ్మద్ అన్నారు. సోమవారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ మాట్లాడుతూ తాను సచివాలయాల ఆకస్మిక తనిఖీకి వెళ్ళినప్పుడు సిబ్బంది లేకపోవడం, ప్రజలకు ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయో తెలియకపోవడాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ కేడర్ తో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం పథకాలను సంతృప్తికరస్థాయిలో అందిస్తోందని తెలిపారు. వీటిని ప్రజలకు అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో మూడు లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిందని, దీని గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. భార్యాభర్తల్లో పింఛన్ తీసుకుంటూ ఒకరు మరణిస్తే మరొకరికి అందిస్తున్నామని చెప్పారు. దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్స్ వాహనాలను పంపిణీ చేయబోతున్నామని, తల్లికి వందనం అర్హత కలిగిన వారికి లబ్ధి చేకూరుస్తున్నామని వెల్లడించారు. వీటన్నింటిపై ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూటమి నాయకులదేనని స్పష్టం చేశారు. ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నామని వెల్లడించారు. ఏ సమస్య వచ్చినా తమ కార్యాలయంలో తెలియజేయాలని స్పష్టం చేశారు.
