సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 6
ప్రజల భద్రతతో పాటు పక్షులు, జంతువుల ప్రాణాల రక్షణ దృష్ట్యా నిషేధిత చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. చైనా మాంజా విక్రయం, వినియోగం పూర్తిగా నిషేధించబడిందని ఆయన స్పష్టం చేశారు.
సంక్రాంతి పండుగ వేళ ప్రత్యేక నిఘా
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఎస్పీ పేర్కొన్నారు. నిషేధిత చైనా మాంజా అమ్మితే తప్పనిసరిగా జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.
ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా
చైనా మాంజా వల్ల పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ తెలిపారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు చైనా మాంజా కొనిపించవద్దని ఆయన సూచించారు.
పోలీసులు – టాస్క్ఫోర్స్ ప్రత్యేక రౌండ్స్
జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందాలు ప్రత్యేక నిఘా ఉంచి రౌండ్స్ నిర్వహిస్తాయని ఎస్పీ వెల్లడించారు. చైనా మాంజా విక్రయం, వినియోగంపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, పండుగ ఆనందం విషాదంగా మారకుండా సహకరించాలని ఎస్పీ కోరారు. ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు తెలిసిన వెంటనే
డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 8712686057, 8712686026
కు సమాచారం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
