Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంహుజూర్‌నగర్‌లో డూప్లికేట్ నిత్యావసర సరుకుల సరఫరా కలకలం పారాషూట్ కొబ్బరినూనె, మైసూర్ సాండల్ సబ్బుల పేరుతో...

హుజూర్‌నగర్‌లో డూప్లికేట్ నిత్యావసర సరుకుల సరఫరా కలకలం పారాషూట్ కొబ్బరినూనె, మైసూర్ సాండల్ సబ్బుల పేరుతో నకిలీ వస్తువుల విక్రయం

హుజూర్‌నగర్, జనవరి6 – డైనమిక్ న్యూస్

స్థానిక వర్తక సంఘం అప్రమత్తత

హుజూర్‌నగర్ పట్టణంలో డూప్లికేట్ నిత్యావసర సరుకుల సరఫరా కలకలం రేపింది. పారాషూట్ కొబ్బరినూనె, మైసూర్ సాండల్ సబ్బులుగా అనుమానాస్పద సరుకులను సరఫరా చేస్తూ టాటా ఏసీ వాహనం తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో స్థానిక వర్తక సంఘ సభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేపట్టారు.

నకిలీ సరుకులపై అనుమానం

వాహనంలో ఉన్న సరుకులు నకిలీవా? లేక అసలైనవేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరుకులకు సంబంధించిన బిల్లులు, అనుమతులు సక్రమంగా లేవని వర్తకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వర్తక సంఘ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు.

గతంలోనూ కేసులు – సత్యానంద్‌పై ఆరోపణలు

మిర్యాలగూడ పట్టణంలోని గణేష్ నగర్‌కు చెందిన సత్యానంద్ గతంలో కిరాణా వ్యాపారం చేసి నష్టపోయిన అనంతరం, అధిక లాభాల కోసం నకిలీ వస్తువుల వ్యాపారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్రాండెడ్ కంపెనీల కవర్లలో నకిలీ సరుకులు ప్యాకింగ్ చేసి మినీ టాటా ఏసీ వాహనం (TS 05 F 1038) ద్వారా విక్రయాలు చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నాడని వర్తకులు చెబుతున్నారు.

హాలియాలో ఇప్పటికే కేసు నమోదు

ఇదివరకే హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వస్తువుల అమ్మకాలపై సత్యానంద్‌పై కేసు నమోదైనట్లు సమాచారం. అయినా పద్ధతి మార్చుకోకుండా చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని బ్రాండెడ్ వస్తువుల ముసుగులో నకిలీ సరుకులను విక్రయిస్తున్నాడని ఆరోపణలు కొనసాగుతున్నాయి.

పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్

ఈ ఘటనపై హుజూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి,నకిలీ వస్తువులు ఎక్కడ తయారవుతున్నాయి?వాటిని సత్యానంద్‌కు సరఫరా చేస్తున్న వారు ఎవరు?ఇప్పటివరకు ఎంతమంది వ్యాపారులకు ఈ నకిలీ సరుకులు చేరాయి?అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments