Sunday, March 29, 2026
Homeతాజా సమాచారంవేసవి వేడి హెచ్చరికలు – పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక జాగ్రత్తలు

వేసవి వేడి హెచ్చరికలు – పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక జాగ్రత్తలు

నేరేడుచర్ల, మార్చి 29, డైనమిక్ న్యూస్

రాబోయే వేసవి కాలంలో తీవ్ర ఎండల దృష్ట్యా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నేరేడుచర్ల మండల వైద్య అధికారి డా. పున్న నాగిని సూచించారు.

మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లొద్దు

ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు ఉపయోగించుకోవాలని తెలిపారు.

దుస్తులు, నీటి వినియోగంపై సూచనలు

వీలైనంతవరకు తెల్లని, తేలికపాటి దుస్తులు ధరించడం మంచిదన్నారు. గర్భిణీ స్త్రీలు రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగాలని, సన్ క్రీములు, లోషన్లు వాడాలని సూచించారు.

గర్భిణులకు విశ్రాంతి అవసరం

గర్భిణీలు ఎక్కువసేపు వ్యాయామం చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. అధిక చెమటతో శరీరంలోని లవణాలు తగ్గి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలని చెప్పారు.

పిల్లల సంరక్షణపై దృష్టి

పిల్లలను ఎండలో తిరగనీయకుండా నీడలో ఉంచాలని, వారికి తరచుగా ద్రవపదార్థాలు ఇవ్వాలని సూచించారు.

వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

వయోవృద్ధులు కూడా మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స

ఎవరైనా ఎండవేడికి వడదెబ్బ బారిన పడితే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో ORS ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ORS వినియోగంపై అవగాహన

వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే ఆశ కార్యకర్తను సంప్రదించి ORS ద్రావణం తయారు చేసి తరచూ తీసుకోవాలని, శరీరంలో నీరు తగ్గకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ పున్న నాగిని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments