Monday, March 2, 2026
Homeతాజా సమాచారంవిద్యార్థులు సృజనాత్మకతతో పాటు వృత్తి నైపుణ్యం సాధించాలి — కలెక్టర్ ఇలా త్రిపాఠి సెట్విన్ ఆధ్వర్యంలో...

విద్యార్థులు సృజనాత్మకతతో పాటు వృత్తి నైపుణ్యం సాధించాలి — కలెక్టర్ ఇలా త్రిపాఠి సెట్విన్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వృత్తి శిక్షణా కార్యక్రమాలు

డైనమిక్,నల్గొండ బ్యూరో, నవంబర్ 4

విద్యార్థులు అకాడమిక్‌ విద్యతో పాటు వృత్తి విద్య, సృజనాత్మకతను అలవర్చుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.మంగళవారం నల్గొండ పట్టణం సమీపంలోని రాంనగర్‌లో గల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలో ఒకేషనల్‌ ట్రైనింగ్‌ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

“వృత్తి విద్యా శిక్షణ విద్యార్థులకు భవిష్యత్తు బాట చూపిస్తుంది”

మారుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఒకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ పొందడం అత్యవసరమని ఆమె తెలిపారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి రంగాల్లో కొత్త టెక్నాలజీల వల్ల జరుగుతున్న మార్పులకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు.భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి వృత్తి విద్యా పరిజ్ఞానం కీలకమవుతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్‌, కేజీబీవీ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 9వ, 10వ, ఇంటర్‌ విద్యార్థులకు సెట్విన్‌ ఆధ్వర్యంలో బ్యాచులవారీగా వృత్తి శిక్షణ అందించనున్నట్టు వెల్లడించారు.

వెబ్‌ డిజైనింగ్‌ నుంచి బ్యూటిఫికేషన్‌ వరకు — విభిన్న కోర్సులు

సెట్విన్‌ ద్వారా వెబ్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటిఫికేషన్‌, ఎడ్యుకేషనల్‌, టెక్నికల్‌ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొత్తం ఫీజులో 50 శాతం రాయితీగా సెట్విన్‌ ఇవ్వనుందని, మిగిలిన 50 శాతం చెల్లించలేని నిరుపేద విద్యార్థుల తరఫున జిల్లా యంత్రాంగం చెల్లించనుందని తెలిపారు.శిక్షణ వారంలో నాలుగు రోజులు జరగనుందని, కోర్సులు రెండు నెలల నుండి ఆరు నెలల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. పాఠశాలలు పూర్తయ్యాక ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వివరించారు.

ప్రతి విద్యార్థి ఏదో ఒక వృత్తి నేర్చుకోవాలి”

విద్యార్థులు తమకు ఇష్టమైన వృత్తిని ఎంపిక చేసుకుని శిక్షణ పొందాలని, జీవితంలో పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని కలెక్టర్ ప్రోత్సహించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, దేశ మహిళా క్రికెట్‌ జట్టు ఇటీవల ప్రపంచ కప్‌ సాధించడాన్ని, నిఖత్‌ జరీన్‌ లాంటి మహిళలు యువతకు ఆదర్శమని గుర్తుచేశారు.ఏ రంగంలోనైనా సాధించాలంటే మానసిక దృఢత అవసరం. చిన్నచిన్న వృత్తులే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు దారితీస్తాయి” అని ఆమె అన్నారు.

పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డిఆర్ఓ వై. అశోక్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్‌రెడ్డి, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ రమేష్‌, డీఈఓ బిక్షపతి, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి దశ్రు నాయక్‌, గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్‌, సెట్విన్‌ ప్రతినిధి రేణుక, ప్రిన్సిపల్‌ కుబ్రా, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments