Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారండ్రగ్ ఫ్రీ సూర్యాపేటకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లుడ్రగ్స్‌కు వ్యతిరేకంగా కదం తొక్కిన యువత

డ్రగ్ ఫ్రీ సూర్యాపేటకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లుడ్రగ్స్‌కు వ్యతిరేకంగా కదం తొక్కిన యువత

సూర్యాపేట బ్యూర్, డైనమిక్ న్యూస్,జనవరి 8

భవిష్యత్‌పై కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద పిలుపునిచ్చారు. డ్రగ్స్ అనే మహమ్మారి యువత జీవితాలను నిర్వీర్యం చేస్తోందని, వాటిని సమాజం నుంచి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా డ్రగ్ ఫ్రీ ఇండియా ర్యాలీ

జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట పట్టణంలో డ్రగ్ ఫ్రీ ఇండియా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోర్టు భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ సంతోష్‌బాబు చౌరస్తా, పీఎస్ఆర్ సెంటర్, పోస్టాఫీస్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు కొనసాగింది.ఈ ర్యాలీలో జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి లక్ష్మీ శారదతో పాటు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే. నరసింహ పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థులు డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో పట్టణ వీధులను మారుమోగించారు.

డ్రగ్స్ వల్ల శరీరం, మనసు, వ్యక్తిత్వం నిర్వీర్యం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో లక్ష్మీ శారద మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల శరీరం, మనసు, వ్యక్తిత్వం పూర్తిగా నాశనమవుతాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాలను తయారు చేసినా, రవాణా చేసినా, విక్రయించినా, కొనుగోలు చేసినా, సేవించినా ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమవుతుందని తెలిపారు. ఈ నేరాలకు బెయిల్ లభించకుండా 20 ఏళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకు కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందన్నారు.

బానిసలకు పునరావాస కేంద్రాల ద్వారా సహాయం

డ్రగ్స్‌కు బానిసైన వారిని పునరావాస కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ జీవితానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సహాయం అందిస్తుందని ఆమె తెలిపారు.

మంచి స్నేహమే విజయానికి మార్గం

జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకమని, మంచి స్నేహం ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, తప్పుడు స్నేహం జీవితాన్ని నాశనం చేస్తుందని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ పంపిణీ జరుగుతోందని, ఎక్కడైనా మాదకద్రవ్యాలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

డ్రగ్స్‌తో కుటుంబాలు, సమాజం నాశనం

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల జీవితాలు, కుటుంబాలు ఆగమవుతున్నాయని అన్నారు. డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును సమాజంలో కలహాలు సృష్టించేందుకు వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనపై నిఘా పెట్టాలని సూచించారు.

యువతే దేశ భవిష్యత్ – డ్రగ్ ఫ్రీ ప్రచారకర్తలుగా మారాలి

జిల్లా ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తు అని, డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కోరారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యాన్ని నాశనం చేసి అకాల మరణాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.

డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతిజ్ఞ

డ్రగ్స్ రహిత సమాజం కోసం జిల్లా ఎస్పీ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్లెక్సీపై సంతకాలు చేశారు.

పలువురు న్యాయ, పరిపాలనా అధికారులు హాజరు

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు, అడిషనల్ జడ్జీలు అపూర్వ రవళి, మంచాల మమత, బార్ అసోసియేషన్ చైర్మన్ లింగయ్య, సెక్రటరీ రాజు, ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments