డైనమిక్,బాపట్ల
మద్యం సేవించి ఎవరూ కూడా సముద్రంలోకి దిగడానికి వీలులేదని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ హాలులో బాపట్ల జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లోని పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లా ప్రధానమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. పిడుగురాళ్ల నుండి వాడరేవు వరకు నిర్మిస్తున్న 167A జాతీయ రహదారి పనులు త్వరలోనే పూర్తికానున్నాయని తెలిపారు. ఆ రహదారి అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వాడరేవు, రామాపురం బీచ్ తదితర సముద్రతీరాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే సూర్యలంక సముద్ర తీరంలో పర్యాటకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా నిజాంపట్నం వైపు నిర్మిస్తున్న రహదారి పూర్తయితే నిజాంపట్నం మండలంంలోని సముద్రతీరాలకు యాత్రికులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
వీటిని దృష్టిలో ఉంచుకొని, ఇటీవల చోటుచేసుకున్న విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా, రాబోయే రోజుల్లో సముద్ర తీర ప్రాంతాల్లో పటిష్ట భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భౌగోళికంగా చూసుకుంటే నిజాంపట్నం నుండి చిన్నగంజాం మండలం వరకు బాపట్ల జిల్లాకు విశాలమైన సముద్రతీరం ఉందని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ యాత్రికులు సముద్రంలోకి దిగి స్నానాలు ఆచరించకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
చీరాలలోని వాడరేవు నుండి చిన్నగంజాం మండలంలోని పొట్టి సుబ్బయ్యపాలెం వరకు సుమారు 9 కిలోమీటర్ల సముద్రతీరం ఉందన్నారు. ఈ సముద్రతీరం వెంబడి రోడ్డు మార్గం ఉండడంతో యాత్రికులు వారికి నచ్చిన ప్రదేశంలో వాహనాలను ఆపి సముద్రంలో స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. తద్వారా అనేకమంది ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయన్నారు.
వీటిని కట్టడి చేయడానికి పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాల్లోనే యాత్రికులు స్నానాలు ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సూచించిన ప్రదేశాలు మినహా ఇతర ప్రదేశాల్లో యాత్రికులు సముద్రంలోకి దిగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సముద్ర తీరాల్లో హెచ్చరిక బోర్డులు, సూచిక బోర్డులు యాత్రికులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అడ్రెసింగ్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు యాత్రికులను అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు. సముద్రతీరం వెంబడి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు.బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా మద్యం సేవించకుండా, మద్యం సేవించి ఎవరు సముద్రంలోకి దిగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉండాలన్నారు. నూతన ఏటివి వాహనాలను ఏర్పాటు చేసుకుని వాటితో తీరం వెంబడి గస్తీ నిర్వహిస్తూ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా యాత్రికులను అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు.తీరం వెంట లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్‌లతో గజఈతగాళ్లు, మెరైన్, స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సముద్రంలో పడవల ద్వారా కూడా గస్తీ నిర్వహించాలన్నారు. ఎవరైనా యాత్రికులు ప్రమాదానికి గురైతే వారిని రక్షించే విధంగా ఉండాలన్నారు. సముద్రతీరాల్లో నిఘా కోసం గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు మరికొన్ని నూతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, దగ్గరలోనే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేయాలని తెలిపారు.వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి, స్థానికంగా ఉన్న రిసార్ట్స్, హోటల్స్‌లో బస చేసి సముద్ర తీరాల్లో ఆహ్లాదకరంగా గడిపేందుకు వచ్చే యాత్రికులకు తగిన సూచనలు చేసి, సురక్షితమైన ప్రదేశాల్లో సముద్రంలోకి దిగి స్నానాలు ఆచరించే విధంగా చూసుకోవలసిన బాధ్యత సంబంధిత రిసార్ట్స్, హోటల్స్ నిర్వహకులపై ఉందన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని అతిథులుగా వచ్చే యాత్రికులకు తగిన సూచనలు ఇచ్చేందుకు గైడ్‌లను, సముద్రతీరంలో స్నానాలు ఆచరించే ప్రదేశాల్లో గజఈతగాళ్లను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం కానుండడంతో, శని, ఆది, సోమ వారాల్లో వేకువజాము నుండే భక్తులు సముద్ర తీరాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కనుక దానిని దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సముద్రతీరంలో తీసుకుంటున్న భద్రతా చర్యలకు సంబంధించిన వివరాలను శుక్రవారం రోజునే తెలపాలని సూచించారు. ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ భక్తులకు, యాత్రికులకు ఏటువంటి అసౌకర్యం తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో రేపల్లె డిఎస్పీ ఏ. శ్రీనివాసరావు, బాపట్ల డిఎస్పీ జి. రామాంజనేయులు, చీరాల డిఎస్పీ ఎం.డి. మొయిన్, డిసిఅర్బి డిఎస్పీ బాల మురళీకృష్ణ, జిల్లా ఎస్బి ఇన్స్పెక్టర్ జి. నారాయణ, రేపల్లె రూరల్ సీఐ పి. సురేష్ బాబు, బాపట్ల రూరల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు, చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, ఇంకొల్లు సీఐ వై. వి. రమణయ్య, నిజాంపట్నం, అడవులదీవి, చీరాల రూరల్, చిన్నగంజాం ఎస్సైలు పాల్గొన్నారు.
