సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11
జిల్లాలో జరుగనున్న ఓట్ల లెక్కింపును శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
మద్దిరాల, నూతనకల్ మండల కేంద్రాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియలో అవసరమైన ఏర్పాట్లపై సిబ్బంది నుండి వివరాలు తెలుసుకున్నారు.
టోకెన్ విధానంలో ఓటు హక్కు వినియోగం
మధ్యాహ్నం 1:00 గంటల లోపు పోలింగ్ కేంద్రాల ఆవరణలోనున్న ప్రతీ ఓటరికి టోకెన్లు జారీ చేసి, ఎవరూ తిరిగి వెళ్లకుండా అందరికీ ఓటు వేయడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఆలస్యం తలెత్తకుండా ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోలింగ్ శాతం వివరాలు
ఆర్.ఓలు వెంకయ్య, రామచంద్రయ్య అందించిన సమాచారం ప్రకారం— మద్దిరాల గ్రామపంచాయతీలోని 12 వార్డుల్లో మొత్తం 3,761 ఓటర్లు ఉండగా, ఉదయం 11 గంటల వరకు 57% పోలింగ్ నమోదైంది. నూతనకల్ గ్రామపంచాయతీలోని 14 వార్డుల్లో మొత్తం 4,568 ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 80.27% పోలింగ్ నమోదైంది.
