సూర్యాపేట బ్యూరో, జనవరి 28, డైనమిక్ న్యూస్
మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పి నరసింహ స్పష్టం చేశారు. సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ భవణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఎస్పి స్వయంగా పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సీసీ కెమెరాల నిఘాలో నామినేషన్ ప్రక్రియ
నామినేషన్ కేంద్రాలు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు మరియు వారి అనుచరులు నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరకుండా సహకరించాలని సూచించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చెక్ పోస్టులు – నిరంతర తనిఖీలు
ఎన్నికల సమయంలో ప్రతి మున్సిపాలిటీ పరిధిలో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, ప్రత్యేక తనిఖీ బృందాలతో వాహనాలు మరియు వ్యక్తులపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. రూ.50 వేలకుపైగా నగదు తీసుకువెళ్లరాదని, అక్రమంగా నగదు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు సంబంధించిన వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో బారికేడింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రత కల్పిస్తామని అన్నారు.
సమస్యాత్మక వ్యక్తులపై ముందస్తు చర్యలు
శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా రూ.5 లక్షల వరకు బైండోవర్ చేస్తున్నామని, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే పూచీ నగదుగా అదే మొత్తాన్ని జరిమానాగా వసూలు చేస్తామని హెచ్చరించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక ఆర్డీవో వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎమ్మార్వో కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, నామినేషన్ పరిశీలన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
