పాలకవీడు, డిసెంబర్ 2(డైనమిక్ న్యూస్)
పాలకవీడు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యలు, వర్గ వైషమ్యాలను ప్రేరేపించే సందేశాలు పెట్టిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పాలకవీడు ఎస్ఐ రువ్వ కోటేశ్ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో నిఘా:
వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికలపై పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఒక వర్గంపై మరొక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు, వీడియోలు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
శాంతి భద్రతలకు సహకారం అవసరం:
ఎన్నికల సమయంలో ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని, ఎలాంటి అపోహలకు లోనుకాక ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఐ సూచించారు.
చట్టపరమైన చర్యలు తప్పవు:
కోడు ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని, వివాదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలకు చోటు లేదని హెచ్చరించారు.
