డైనమిక్ న్యూస్ / సూర్యాపేట బ్యూరో, డిసెంబర్ 29
నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ సోమవారం ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సాయంత్రం 6 గంటల నుంచే వాహనాల తనిఖీలు
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌లు, క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించకూడదన్నారు.
డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం
ప్రజలను భయాందోళనకు గురిచేసేలా క్రాకర్స్ పేల్చడం, అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. త్రిబుల్ రైడింగ్, పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లతో వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
రోడ్లపై హంగామాకు అనుమతి లేదు
గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీలు నిర్వహించడం, రోడ్లపై కేక్ కటింగ్ చేయడం నిషేధమన్నారు.
కుటుంబంతో ఇంట్లోనే వేడుకలు
ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఉత్తమమని ఎస్పీ సూచించారు. ప్రమాదాలకు దూరంగా ఉండి, పోలీస్ శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు.
