నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 8
మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా చర్లపల్లి సమీపంలోని విపస్య పాఠశాలలో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి మంత్రి ప్రారంభించారు.
క్రీడలతో చురుకుదనం పెరుగుతుంది
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చురుకుగా, ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కొన్ని పాఠశాలలు కేవలం అధిక జీపీఏల సాధనకే పరిమితమవుతున్నాయని, విద్యతో పాటు క్రీడలపైనా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించాలి
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో సాధన చేసి విజయాన్ని సాధించాలని విద్యార్థులకు సూచించారు. ప్రైవేటు విద్యా యాజమాన్యాలు పేద విద్యార్థులకు ఎల్లవేళలా సహాయం అందించేలా ముందుకు రావాలని కోరారు.
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటి రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ వద్ద యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల భవనం నిర్మాణ దశలో ఉందన్నారు.తరగతి గదులు, డార్మెటరీలు, డైనింగ్ హాల్స్, కిచెన్‌లు, క్రికెట్, ఫుట్‌బాల్ స్టేడియాలతో ఈ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఈ పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
విద్యతోనే ఉద్యోగ అవకాశాలు
పాఠశాల లేదా కళాశాల పూర్తయ్యే సరికి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా ఈ విద్యా వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో రాణించేలా చదువుకోవాలని ఆకాంక్షించారు.
నల్గొండ అభివృద్ధి ప్రణాళికలు
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. ఆర్ & బి శాఖ ద్వారా రూ.200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, పట్టణంలో రూ.700 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మిస్తున్నట్లు తెలిపారు. నల్గొండను హైదరాబాద్‌కు మోడల్ నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
బొట్టుగూడ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.12 కోట్లతో నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ పాఠశాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
క్రీడలు ఆరోగ్యానికి ఆధారం: కలెక్టర్
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో క్రీడలు చాలా అవసరమని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు అవి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. క్రీడల్లో గెలిచినా, ఓడినా సమానంగా స్వీకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, డిటిసి వాణి, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
