గుంటూరు, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సూరజ్ అర్జీలను స్వీకరించారు.జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సూరజ్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి,ఆర్డీఓలు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 122అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు సంబంధించిన ఆడిట్ ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తి చేయాలని, ఇందులో నాణ్యత బాగుండాలన్నారు. ఆర్డీఓలు, జిల్లా అధికారులు ప్రతివారం తనిఖీలు నిర్వహించాలని, ఆయా మండలాలకు వెళ్ళినప్పుడు గ్రీవెన్స్ జాబితా సిద్ధంగా ఉంచాలని అధికారులకు చెప్పాలని, ఆర్డీవోలు, జిల్లా అధికారులు ఒకటి, రెండు అర్జీలను స్వయంగా తనిఖీ చేయాలన్నారు. దీని ద్వారా గ్రీవెన్స్ నాణ్యత తెలుసుకుని ఫీడ్ బ్యాక్ అందించాలని, యాదృచ్ఛికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. తాను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసినప్పుడు అర్జీల పరిష్కారంలో నాణ్యత సరిగా లేదని తెలుసుకోవడం జరిగిందని, ఆర్డీవోలు, జిల్లా అధికారులు అర్జీల పరిష్కారంలో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తహసిల్దార్ లు వారి దగ్గరికి వచ్చిన గ్రీవెన్స్ సరైన విధంగా పరిష్కరించారా అనేది చూడాలని, దీనిపై దృష్టి పెట్టాలని, అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులపై ఉందన్నారు. నాణ్యతగా అర్జీలను పరిష్కరించకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడమన్నారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత మరింత పెంచాలని, కింది స్థాయిలో కొన్ని లోపాలు ఉన్నాయని, వారిని సరిదిద్దుకోవాలన్నారు. తహసిల్దార్లు, ఎంపీడీవోలు, క్షేత్రస్థాయి అధికారులు కలెక్టరేట్ నుంచి ఏ అర్జీ వచ్చినా వ్యక్తిగతంగా పరిశీలన చేసి పరిష్కరించాలని, వ్యక్తిగతంగా పరిశీలనకు వెళ్లకుండా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని అధికారులు తెలియజేయాలన్నారు. విఐపి, ప్రజా ప్రతినిధులు ఇచ్చిన రిఫరెన్స్ లను పెండింగ్ లేకుండా పరిష్కరించాల్సినవి వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులకు ఈ ఆఫీస్ ద్వారా తపాల్ లను పంపించడం జరుగుతోందని, రోజువారీగా వాటిని చూసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
