నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11
నల్లగొండ జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అనంతరం జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎస్పీ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు.
అల్లర్లు, గొడవలకు కఠిన చర్యలు
కౌంటింగ్ సమయంలో అల్లర్లు, గొడవలు సృష్టించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతల భంగానికి పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా బృందాలు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాయి.
విజయోత్సవ ర్యాలీలకు నో
ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు చేపట్టరాదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.
