నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 14
నల్లగొండ జిల్లాలో ఆదివారం జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా పరిశీలించి పర్యవేక్షించారు.
163 BNSS (144 సెక్షన్) అమలు
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 163 BNSS (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా గుమికూడరాదని స్పష్టం చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
పోలింగ్ నిర్వహణకు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ నిఘా కొనసాగుతుందని తెలిపారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణాసంచా పేల్చడం, డీజేలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తే, వారిపై కేసులు నమోదు చేయబడతాయని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
