నరసరావుపేట, ఫిబ్రవరి 5, డైనమిక్ న్యూస్
పల్నాడు జిల్లాలో ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ పల్నాడు జిల్లా ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌కు వినతిపత్రం అందజేశారు.బుధవారం నరసరావుపేట మున్సిపాలిటీ గెస్ట్ హౌస్‌లో జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌ను కమిటీ సభ్యులు కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఐదు నెలలుగా సమావేశాలు లేవు
జిల్లాలో ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి సభ్యులుగా నియామక పత్రాలు అందించి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని కమిటీ సభ్యులు తెలిపారు.ఈ విషయాన్ని కమిటీల చైర్మన్‌గా ఉన్న పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లకు పలుమార్లు తెలియజేసినా కాలయాపన జరుగుతోందని వాపోయారు.
ఎస్సీ–ఎస్టీల సమస్యలు అధికం
పల్నాడు జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిపై నివేదికలు రూపొందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఇప్పటికే రెండుసార్లు కమిటీ సమావేశాలు నిర్వహించారని గుర్తు చేశారు.
పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం లేదని ఆవేదన
ఎస్సీ–ఎస్టీలు దాడులకు గురైనప్పుడు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ఇచ్చినా వెంటనే కేసులు నమోదు చేయడం లేదని, చట్టప్రకారం చర్యలు తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
భూ సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
శివరాత్రి తర్వాత సమావేశాలు
కమిటీ సభ్యుల వినతికి స్పందించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను శివరాత్రి తర్వాత ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఘన సన్మానం
అనంతరం కమిటీ సభ్యులు చైర్మన్ జవహర్‌తో పాటు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ గౌతమ్ రాజు, మేకల దాసులను బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కుక్కమూడి ప్రసాద్ అలియాస్ ప్రసాదరావు, గోదా జాన్ పాల్, కోట నాయక్, మందా రవి, క చితిరాల బాలు అలియాస్ మీరయ్య, పాండు నాయక్, చింతపల్లి లాజర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
