గరిడేపల్లి , డైనమిక్ న్యూస్,జనవరి 16
భారత సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గరిడేపల్లి మండలం కల్మల్ చెర్వు గ్రామంలో అరుదైన, భావోద్వేగపూరిత సంఘటన చోటుచేసుకుంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న సైనికుల పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ రాపోలు నవీన్ కుమార్ స్థానిక సైనికుడు వట్టే దశరద్ యాదవ్‌కు ఘన నిరాజనం సమర్పించారు.
జవాన్‌కు పాదపూజ చేసి కృతజ్ఞతలు
ఈ సందర్భంగా నవీన్ కుమార్ సైనికుడి కాళ్లు కడిగి పుష్పాలు సమర్పించి దేశ రక్షకులకు సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దుల్లో మంచుకొండలు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో దేశ భద్రతే పరమావధిగా జీవితం అంకితం చేస్తున్న జవాన్లకు ఇది గౌరవ సూచకంగా నిలిచింది.
‘ప్రతి జవాన్ భరతమాత ముద్దుబిడ్డ’
ఈ కార్యక్రమంలో రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ…
“మంచుకొండల్లో, అత్యంత కఠిన పరిస్థితుల్లో యుద్ధం చేస్తూ దేశాన్ని కాపాడుతున్న ప్రతి జవాన్ భరతమాత ముద్దుబిడ్డ. ఆసేతు హిమాచలం వరకు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి” అని పేర్కొన్నారు.
సైనికులకు గౌరవం ప్రతి భారతీయుడి బాధ్యత
ప్రాణాలకు తెగించి దేశ సేవ చేస్తున్న సైనికులకు గౌరవం ఇవ్వడం ప్రతి భారతీయుడి బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న జవాన్లందరికీ భారత సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామస్తుల ప్రశంసలు
దేశభక్తిని చాటుతూ సైనికుడిని వినూత్నంగా గౌరవించిన నవీన్ కుమార్ తీరును గ్రామస్తులు, యువత అభినందించారు. ఈ కార్యక్రమం గ్రామంలో దేశభక్తి భావాలను మరింత బలపరిచిందని వారు పేర్కొన్నారు.
