డైనమిక్ డెస్క్ హైదరాబాద్, నవంబర్ 1
తెలంగాణలో దేవాలయ భూముల సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ భూములపై జరుగుతున్న ఆక్రమణలను అరికట్టేందుకు సర్కారు కొత్త బిల్లు తెస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్, 1987లోని చాప్టర్ XIలో మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో సెక్షన్లు 83, 84లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది.
కబ్జాకోరులకు చెక్
ట్రిబ్యునల్, కోర్టు కేసుల పేరుతో వేల ఎకరాల దేవాదాయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వందల ఎకరాలు కబ్జా అయ్యాయని ప్రభుత్వ అంచనా. ఈ పరిస్థితికి చెక్ పెట్టి భూములను తిరిగి ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేందుకు నడుంబిగించింది.
దేవాలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి
దేవాలయాలు, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములు, భవనాలు ఎవరి చేతిలో ఉన్నా వాటిని తిరిగి తీసుకోవాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఎండోమెంట్ అధికారులు అవసరమైతే పోలీసు, హైడ్రా సహకారంతో ఆక్రమణలను తొలగించేలా చర్యలు చేపడుతున్నారు.
చట్టపరమైన బలం పెంపు
సవరణ బిల్లుతో దేవాదాయ భూముల రక్షణకు చట్టపరమైన బలం పెరిగే అవకాశం ఉంది. కబ్జాకోరులు ఎటువంటి లూప్ హోల్స్ ఉపయోగించు కోలేని విధంగా కొత్త నిబంధనలు తీసుకురానుంది ప్రభుత్వం. దేవాలయ భూముల పునరుద్ధరణ, రక్షణ దిశగా ఈ చట్టం మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
