ఇప్పటివరకూ 40 వేల నిరుద్యోగులు రిజిస్ట్రేషన్లు నమోదు
డైనమిక్,సూర్యాపేట బ్యూరో,అక్టోబర్ 25
గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హుజూర్నగర్‌లో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళాను నిర్వహించినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాము చేపట్టిన జాబ్ మేళా విశేష విజయవంతంగా సాగుతుండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అతి పెద్ద జాబ్ మేళా : ఉత్తమ్ కుమార్ రెడ్డి
శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.“హుజూర్నగర్‌లో ఇంత పెద్ద స్థాయిలో జాబ్ మేళా ఇంతవరకు జరగలేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద జాబ్ మేళా” అని అన్నారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వేలాది మంది నిరుద్యోగులకు ఈ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. పలువురు కంపెనీలు అభ్యర్థులను అక్కడికక్కడే ఎంపిక చేసి ఆఫర్ లెటర్లు కూడా అందజేశాయని పేర్కొన్నారు.
‘నీళ్లు–నిధులు–నియామకాలు’ తెలంగాణ పునాదులు
మంత్రి మాట్లాడుతూ, “నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానిలో ‘నియామకాలు’ కీలకం. ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో 75 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేట్ రంగంలోనూ వేలాది ఉద్యోగాలను అందించేందుకు ఈ జాబ్ మేళాలను చేపట్టాం” అని తెలిపారు.ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు వచ్చే వరకు నిరంతరం కృషి చేస్తామన్నారు
275 కంపెనీల పాల్గొన్న– 40 వేల రిజిస్ట్రేషన్లు
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ మాట్లాడుతూ, రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 275 కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు.డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET)** మరియు సింగరేణి కాలరీస్ సహకారంతో ఈ మేళాను ఏర్పాటు చేశాం. ఐటి, సర్వీస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, ఫార్మా, సిమెంట్ తదితర రంగాల సంస్థలు హుజూర్నగర్‌కు వచ్చి ఉద్యోగాలు అందిస్తున్నాయి” అని తెలిపారు.ఇప్పటివరకు 40,000 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భారీ స్పందన దృష్ట్యా జాబ్ మేళాను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నాం.పాల్గొనేవారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పించాం” అని కలెక్టర్ వివరించారు.



పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఈ కార్యక్రమంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, సింగరేణి కాలరీస్ హెచ్ఆర్ మేనేజర్ చంద్ర, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎస్పీలు, అదనపు కలెక్టర్ సీతారామ రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
