డైనమిక్ న్యూస్,గుంటూరు, ఫిబ్రవరి 17
శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) నిర్మాణ పనులు నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి అయ్యేలా కాంట్రాక్ట్ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ రోడ్లు & భవనాల శాఖ (ఆర్ అండ్ బి), నగరపాలక సంస్థ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు.మంగళవారం శంకర్ విలాస్ ఆర్వోబి నిర్మాణ పనులను, ఏటుకూరు రోడ్డులోని కంపోస్ట్ యార్డును జిల్లా కలెక్టర్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ సంయుక్తంగా పరిశీలించారు.
బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిడ్జి పిల్లర్లు, డ్రైనేజీ నిర్మాణాలు తదితర పనులు ప్రణాళిక ప్రకారం సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థకు సూచించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా మే నెలాఖరు నాటికి బ్రిడ్జి ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.నిర్మాణ ప్రాంతంలో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే పక్కకు తరలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పనులు సజావుగా సాగేందుకు ఆర్ అండ్ బి, నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు.
కంపోస్ట్ యార్డు పనితీరుపై సమీక్ష
అనంతరం కలెక్టర్ ఏటుకూరు రోడ్డులోని కంపోస్ట్ యార్డును సందర్శించి ఎంఆర్ఎఫ్ (మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ), విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్లు, వేస్ట్ రీసైక్లింగ్ పాయింట్లు, నిర్మాణంలో ఉన్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ (జిటిఎస్)లను పరిశీలించారు.నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో ఏటుకూరు పాయింట్లో రోజుకు 50 టన్నుల విండ్రో, 35 టన్నుల వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నామని, వీటి సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. తయారైన ఎరువును కిచెన్ గార్డెన్లు, జిఎంసి పార్కులు, రహదారి డివైడర్లపై మొక్కలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.10 టన్నుల సామర్థ్యంతో ఉన్న ఎంఆర్ఎఫ్ కేంద్రం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నామని, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నామని తెలిపారు.
తడి–పొడి చెత్త వేరు చేయడం అవసరం
వ్యర్థాల నుంచి ఎరువు తయారీ ప్రక్రియను మరింత విస్తరించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహిస్తే పర్యావరణహితంగా సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి తడి చెత్తతో ఎరువు, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం మంచి విధానమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె. శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, డిసిపీ సూరజ్ కుమార్, ఏసిపీ రెహ్మాన్, ఈఈలు విష్ణు, వేణు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్ తదితర అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
