సూర్యాపేట బ్యూరో, డైనమిక్,నవంబర్3
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల కోసం “ప్రెస్ క్లబ్” భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ రెండవ వారంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సోమవారం ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.
“జర్నలిస్టులకు నిలువ నీడ లేదు”
జర్నలిస్టులు అహర్నిశలు ప్రజలకు, ప్రభుత్వానికి సమాచారంఅందజేస్తున్నప్పటికీ వారికి రాష్ట్రంలో నిలువనీడ లేకుండా పోయిందని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం గురించి ఆలోచించే నాయకత్వం, పరిపాలన రెండూ కరువయ్యాయని ఆయన తెలిపారు.
“ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లున్నాయి”
ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టుల భవనాల కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే చూస్తున్నారని యాదగిరి వ్యాఖ్యానించారు. అధికారుల స్పందన లేకపోవడానికి జర్నలిస్టు సంఘాల మధ్య ఐక్యత లోపమే ప్రధాన కారణమని అన్నారు.
“యూనియన్‌ల మధ్య విభేదాలు సమస్య”
కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం ముందుకు వచ్చినా, యూనియన్‌ల మధ్య విభేదాల వల్ల ఆ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. “తమదే తమదని అనుకునే నాయకుల వైఖరి వల్ల ప్రభుత్వానికి కూడా వెనక్కు తగ్గాల్సి వస్తోంది” అని యాదగిరి విమర్శించారు.
“ఇకనైనా ఐక్యత చూపాలి”
ఇకనైనా అన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు ఐక్యంగా ముందుకు రావాలని యాదగిరి పిలుపునిచ్చారు. ఎటువంటి ఇగో ఫీలింగ్స్ పక్కనపెట్టి, భవిష్యత్ తరాల కోసం చక్కటి మార్గం వేయాలని కోరారు.
“సూర్యాపేట నుండి దీక్ష ప్రారంభం”
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ నవంబర్ రెండవ వారంలో సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.అన్ని యూనియన్లు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
