నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 15
గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడవ విడతగా నిర్వహించనున్న దేవరకొండ డివిజన్ పరిధిలోని మండలాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మీ సమక్షంలో జరిగింది.
ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తి
ఈ నెల 11, 14 తేదీలలో నల్గొండ, చండూరు, మిర్యాలగూడ డివిజన్లలో రెండు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 17న దేవరకొండ డివిజన్‌లో పోలింగ్
ఈ నెల 17న దేవరకొండ డివిజన్ పరిధిలోని చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాల్లోని 2206 పోలింగ్ కేంద్రాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం నిర్వహించారు.
అధికారుల సమక్షంలో ర్యాండమైజేషన్
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, డీఈవో బిక్షపతి, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
2206 బృందాలు అవసరం
మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు గాను 2647 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2959 మంది ఇతర పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందుకు మొత్తం 2206 పోలింగ్ బృందాలు అవసరం కానున్నట్లు అధికారులు తెలిపారు.
ఐటీ విభాగం ప్రతినిధుల హాజరు
ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఈ-జిల్లా మేనేజర్ దుర్గారావు, ఎన్ఐసి ప్రతినిధి ప్రేమ్ తదితరులు హాజరయ్యారు.
