నరసరావుపేట, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
మారుతున్న కాలానికి, ఆహారపు అలవాట్లకు తగినట్టుగా రైతులు తమ సాగు విధానాలు, పైర్ల ఎంపికను మార్చాల్సిన సమయం వచ్చింది.ఫుడ్ ప్రాసెసింగ్ విధానంతో రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధరలు పొందవచ్చు.చంద్రబాబు ఉన్నందునే సకాలంలో రైతుల ఉత్పత్తులు కొనుగోళ్లు, మద్ధతు ధర సాధ్యమైంది.
రైతన్నా మీకోసం కార్యక్రమంలో మాజీమంత్రి ఎం ఎల్ ఏ ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నందునే సకాలంలో రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్ధతు ధరల అమలు సాధ్యమైందని, నూతన సాగు విధానాలతో రాష్ట్ర వ్యవసాయరంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలన్న గట్టి పట్టుదలతో సీఎం ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నాదెండ్ల మండలంలో కూటమిప్రభుత్వం నూతనంగా నిర్మించిన రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల ఇళ్లకు వెళ్లిన ప్రత్తిపాటి.. ముఖ్యమంత్రి రైతాంగానికి రాసిన లేఖతో పాటు, ప్రభుత్వం అమలుచేయాలనుకుంటున్న నూతన సాగువిధానాలు.. అందించే సబ్సిడీలు, ప్రోత్సాహకాలను వారికి తెలియచేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రైతులు, గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
గత పాలకుల అసమర్థ పాలన రాష్ట్రాన్ని రైతు ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో నిలిపింది…
వేరుకు.. కాడకు, ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియని గత పాలకుల అసమర్థ పాలనతో రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, వారు తమ బాగోగులపై శ్రద్ధ పెట్టి, సాగును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ప్రత్తిపాటి చెప్పారు. రాష్ట్ర రైతులకు మేలు జరిగి.. రాష్ట్ర వ్యవసాయరంగం దేశానికే ఆదర్శంగా నిలవాలంటే చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఏ విధమైన వ్యాపారం చేస్తే లాభాలొస్తాయని ఆలోచించినట్టు.. వ్యవసాయంలో కూడా పరిస్థితులకు తగినట్టుగా ఏ పంట వేస్తే లాభాలు వస్తాయనే ఆలోచన రైతులు చేయాలన్నారు. పత్తి, మిరప, వంటి సాంప్రదాయ పంటల సాగుతో నష్టపోతున్న రైతాంగం, నూతన పైర్ల పెంపుపై ఆలోచన చేయాలన్నారు. గతంలో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ పద్ధతిని రాష్ట్రంలోని కరువు ప్రాంత రైతాంగానికి పరిచయం చేసింది చంద్రబాబేనన్న ప్రత్తిపాటి, కొత్తదనాన్ని ప్రజలకు చేరువచేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారన్నారు. 2019-24 మధ్య చంద్రబాబును వద్దనుకున్నందుకు రైతాంగం ఎంత నష్టపోయిందో చూశామన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలతో రైతులకు అధిక లాభాలు…
వ్యవసాయం చేసిన వ్యక్తిగా రైతుల కష్టాలు..కన్నీళ్లు తనకు తెలుసన్న ప్రత్తిపాటి.. మారుతున్న కాలం.. ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులుకూడా కొత్త పంటల సాగువైపు మొగ్గుచూపాలన్నారు. సరికొత్త విధానాలతో కొత్తపంటల్ని సాగుచేస్తే దిగుబడి, లాభాలు రెండూ రైతుల సొంతమవుతాయన్నా రు. అలానే పండించే ఉత్పత్తుల్ని రైతులే సొంతంగా ఫుడ్ ప్రాసిసింగ్ చేయడం ద్వారా మరిన్ని లాభాలు పొందవచ్చన్నారు. రైతులు పండించే మిర్చిని స్పైసెప్ బోర్డు వారు పొడి చేసి మార్కెట్ చేస్తున్నారని, అలానే కొన్ని దేశాల్లో కూరగాయల్ని ప్రాసెస్ చేసి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తున్నారన్నారు. అటువంటి ప్రాసెసింగ్ వ్యవస్థను రాష్ట్ర రైతాంగానికి పరిచయం చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారాయన్న ప్రత్తిపాటి … గతంలోబియ్యం తినేవారు ఇప్పుడు కొర్రలు, అరికెలు, రాగులు వంటివి తీసుకుంటున్నారన్నారు. అపరాలు, ఉద్యాన, కూరగాయల పంటల సాగుతో ఎక్కువ లాభాలు వస్తాయని, ఆ దిశగా రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా తమ ఇళ్లకు వచ్చే వ్యవసాయ సిబ్బంది సేవల్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే శనగలను రైతులకు పంపిణీ చేసిన ప్రత్తిపాటి.. అనంతరం గ్రామరైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. టార్పాలిన్, సిల్పాలిన్ పట్టలు, తైవాన్ స్ప్రేయర్లు కావాలని, పత్తి కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించాలని ఈ సందర్భంగా రైతులు ప్రత్తిపాటిని కోరారు. రైతులు కోరేవి వీలైనంత త్వరగా వారికి అందేలా చూడాలని, ఉన్నతాధికారులకు పరిస్థితులు వివరించి క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు మేలు జరిగేలా చూడాలని ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ అధికారులకు ప్రత్తిపాటి సూచించారు.కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, సొసైటీ చైర్మన్ నల్లమోతు హరిబాబు, రైతు నాయకులు గుర్రం నాగపూర్ణ చంద్రరావు, యనమదల సూర్య నారాయణ, డిఏవో జగ్గారావు, అగ్రికల్చర్ అధికారులు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
